ఉలవపాడు: కూటమి నేతల అక్రమ గ్రావెల్ దందాకు అడ్డే లేకుండా పోతోంది. కందుకూరు, కొండపి నియోజకవర్గాల అక్రమార్కుల సమన్వయంతో మండల పరిధిలో ఈ గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఉలవపాడు మండల పరిధిలో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. మామిడి తోటలను కొట్టి మరీ ప్లాట్లు వేస్తున్నారు. వీటిని చదును చేసి లే అవుట్‌లా తయారు చేయాలంటే భారీగా గ్రావెల్ కావాలి. ఇదే ఇప్పుడు కూటమి నేతల అక్రమార్జనకు వరంలా మారింది. ఉలవపాడు పోలీస్ స్టేషన్ ఎదురుగా, కొల్లూరుపాడు బైపాస్ వద్ద, ఉలవపాడు ఉత్తర బైపాస్ సమీపంలో వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ప్రస్తుతం ఉలవపాడు పరిధిలో చెరువుల్లో నీరు ఉంది. దీంతో ఇక్కడ గ్రావెల్‌ను తరలించలేని పరిస్థితి. దీంతో కొండపి నియోజకవర్గం శింగరాయకొండ నుంచి రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా ఈ గ్రావెల్ తరలిస్తున్నారు. ఉలవపాడు మెయిన్‌రోడ్ నుంచి ఈ గ్రావెల్ వెళుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
జరుగుతుందిలా...
వెంచర్లను ఏర్పాటుచేసి గ్రావెల్ కావాలనుకున్నవారు నియోజకవర్గ టీడీపీ పెద్దనేతకు దూరపు బంధువు అయిన వలేటివారిపాలెం మండలానికి చెందిన మరో నేతను సంప్రదించాలి. ఆయన వెంటనే రంగంలోకి దిగుతాడు. ఏవెంచర్ అయినా అతని ఆధ్వర్యంలోనే గ్రావెల్ తరలించాలి. వెంచర్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి సుమారు రూ.10 లక్షల వరకు నగదు చెల్లిస్తే అధికారులు, నాయకులతో కలసి వెంచర్లకు సంబంధించిన అనుమతులు లాంటి వాటికి సహకరిస్తున్నట్లు సమాచారం. ఇక గ్రావెల్ తరలింపు సింగరాయకొండకు చెందిన కూటమి నేతలు చూసుకుంటారు. వీరు ఒక టిప్పర్‌కు రూ.1500 చొప్పున సదరు దూరపు బంధువుకు చెల్లించాలి. అప్పుడు గ్రావెల్ తరలింపు జరుగుతుంది. ఒక్కో టిప్పర్‌కు రూ.7500 వెంచర్ యజమాని చెల్లించాలి. ఇలా పక్కాగా గ్రావెల్ దందా సాగిస్తున్నారు.
ప్రేక్షక పాత్రలో అధికారులు....
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పలు అక్రమ వ్యాపారాల్లో అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం గ్రావెల్‌దందాను కూడా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎంపీడీఓ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం మీదుగా పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉన్న వెంచర్లకు గ్రావెల్ తరలిస్తున్నారు. ఈ మూడు కార్యాలయాల మీదుగా అర్ధరాత్రి టిప్పర్లు వెళుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కూటమి నేతల ప్రమేయం ఉండడంతో అధికారులు కూడా దందాను నియంత్రించలేకపోతున్నారు. ఈ గ్రావెల్ దందా కందుకూరు, కొండపి నియోజకవర్గ కూటమి నేతలకు ఆదాయవనరుగా మారింది. రోజుకు సుమారు 50 నుంచి 100 ట్రిప్పుల వరకు అక్రమ గ్రావెల్ తరలిస్తున్నారు. కూటమి నాయకుల సహకారంతో జరుగుతున్న ఈ అక్రమ దందాను ఆపే పరిస్థితి ఉందా లేదా అనేది వేచి చూడాలి.


