హోం గార్డుల వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

హోం గార్డుల వేతన వెతలు

Apr 20 2026 7:18 AM | Updated on Apr 20 2026 7:18 AM

నేటికీ జీతాలు ఇవ్వని ప్రభుత్వం ఇబ్బందుల్లో హోం గార్డులు గత ప్రభుత్వంలో 5వ తేదీలోపే జీతాల విడుదల

ఉలవపాడు: ఏప్రిల్‌ నెల ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా పోలీసు శాఖలో పనిచేస్తున్న హోం గార్డులకు నేటి వరకు జీతాలు అందలేదు. ప్రకాశం జిల్లా పరిధితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నేటికీ హోంగార్డుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ కాలేదు. జీతాలు పడకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరికీ ఇప్పుడు ప్రతినెలా ఈఎంఐలు ఉంటున్నాయి. సమయానికి ఈఎంఐ కట్టకపోతే ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు బ్యాంకుల్లో సిబిల్‌ స్కోర్‌ పడిపోతుంది. తదుపరి లోన్ల మంజూరుకు కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 20వ తేదీ వచ్చినా ఇంత వరకు ప్రభుత్వం హోం గార్డుల జీతభత్యాల గురించి పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం ట్రెజరీకి జాబితాను పంపాలని కూడా కోరారు. అయినా నేటి వరకు వారికి జీతాలు వేయలేదు. జీతాలు లేకుండా కుటుంబాలు ఎలా గడవాలని వారు అంటున్నారు.

జీతాల కోసం ఎదురుచూపులు..

ప్రకాశం జిల్లా పరిధిలో 598 మంది హోం గార్డులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.21,300 జీతం అందించాలి. రూ.1,27,37,400 చెల్లించాలి. నేటి వరకు ట్రెజరీ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల మంది హోంగార్డులు ఉన్నారు. వీరెవరికీ ఇంత వరకు జీతాలు రాలేదు. పోలీసు శాఖలో మిగిలిన వారికి కూడా ఈ నెల 11న ప్రభుత్వం జీతాలు చెల్లించింది.

గత ప్రభుత్వంలో రెండు రోజుల్లోనే..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో హోం గార్డులు ప్రతినెలా 1, 2 తేదీల్లోనే జీతం అందుకునే వారు. హోంగార్డులు ఇబ్బందులు పడుతున్నారని అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జీతాలు పెంచడంతో పాటు ప్రతినెలా 1వ తేదీన అన్ని శాఖలతో పాటు వారికి జీతాలు అందించాలని ప్రభుత్వం సర్క్యులర్‌ను జారీ చేశారు. ఆమేరకు క్రమం తప్పకుండా జీతాలిచ్చారు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో హోంగార్డులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఇప్పటికై నా జీతాలు విడుదల చేయాలని హోం గార్డులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement