రాధాకృష్ణను అరెస్టు చేయాలి సామాజిక కార్యక్రమాలతో నాయకత్వ లక్షణాలు రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫ్యాప్టో నాయకులు మండిపడ్డారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, పీఆర్సీ ఇప్పటికే ఆలస్యమైనందున 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలులో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రమైన డీఆర్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాల వద్ద గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాప్టో ప్రకాశం జిల్లా చైర్మన్ కే ఎర్రయ్య అధ్యక్షత వహించగా, రాష్ట్ర నాయకురాలు మంజుల ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పదో తరగతి మూల్యాంకన కేంద్రాల వద్ద ఉపాధ్యాయులంతా నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగినట్లు తెలిపారు. కూటమి పాలకులు గత ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ప్రకటించిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మంజుల విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పీఆర్సీ ఇస్తామని, ఆలస్యమైతే కరువు భత్యం ప్రకటిస్తామని, దీర్ఘకాలిక బకాయిలు చెల్లిస్తామని, సీపీఎస్ జీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని, పెండింగ్ డీఏలు ప్రకటిస్తామని, మెమో 57 అమలు చేస్తామని, కారుణ్య నియామకాలను కాలయాపన లేకుండా చేపడతామని ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీలిచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం మరచారని విమర్శించారు. 12వ పీఆర్సీ ఇప్పటికే మూడు సంవత్సరాలు ఆలస్యమైందని, కనీసం పీఆర్సీ కమిషన్‌ను కూడా ప్రభుత్వం నియమించలేని స్థితిలో ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి పీఆర్సీ కాలయాపనతో ఉద్యోగి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాడని వాపోయారు. పీఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో 30 శాతం మధ్యంతర భృతి తక్షణమే మంజూరు చేయాలని మంజుల డిమాండ్ చేశారు. 30 వేల కోట్ల దీర్ఘకాలిక బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాటి చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించి విడతల వారీగా ఉద్యోగి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ నాలుగు డీఏలు పెండింగ్లో పెట్టడం ఏమిటని నిలదీశారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలు వెంటనే ప్రకటించాలన్నారు. 57 మెమో అమలు చేసి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులను పాత పెన్షన్ కిందికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సర్వీసుల సమస్య, కారుణ్య నియామకాలు, మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలన్నారు. అర్బన్ ఎంఈఓ పోస్టులు కేటాయించాలని, పాఠశాల స్థాయిలో బోధనేతర కార్యక్రమాలు రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ప్రతి ఉన్నత పాఠశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్లను నియమించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకులాలు, ఎయిడెడ్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మంజుల హెచ్చరించారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షల్లో భారీగా టీచర్లు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ రఫీ, నాయకులు అబ్దుల్ హై, గవిని శివశంకర్, దేవ సహాయం, లక్ష్మీనారాయణ, చాతల వెంకటేశ్వర్లు, శేషారావు, ఆర్.సంజీవ్ కుమార్, శ్రీనివాసులు, రఘు బాబు, సుబ్బారావు, చల్లా శ్రీనివాసులు, శేషు, అశోక్, కీర్తి తదితరులు పాల్గొన్నారు.
12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆర్థికంగా నష్టం జరగకుండా చూడాలి ఫ్యాప్టో నాయకుల డిమాండ్ పది మూల్యాంకన కేంద్రాల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన
రాధాకృష్ణను అరెస్టు చేయాలి
ఖైదీలను సంస్కరించే శిక్షణాలయాలు.. జైళ్లు
కనిగిరిలో ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్,
పార్టీ నేతలు
మార్కాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నాయకులు
మహిళలను కించపరుస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్
ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో గురువారం ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్ సీపీ నాయకుల భార్యలు, మహిళలను దూషించిన రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. – సాక్షి, ఒంగోలు
● ఏకేయూ వీసీ మూర్తి
ఒంగోలు సిటీ: సామాజిక అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఆంధ్రకేసరి యూనివర్శిటీ వైస్ చాన్సిలర్ డీవీఆర్ మూర్తి అన్నారు. స్థానిక యూనివర్శిటీలో ఫైనలియర్ ఎంబీఏ ఆక్వా కల్చర్, మ్యాథమేటిక్స్, సోషల్ వర్క్ ఎడ్యుకేషన్, కెమిస్ట్రీ డిపార్టుమెంట్ల విద్యార్థులకు గురువారం ఎన్‌ఎస్‌ఎస్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలంటే సామాజిక సేవ చేయాలని తెలిపారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారానే నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. సమాజమే ఒక పెద్ద ప్రయోగశాల అని, సమాజంలో ఉన్న రకరకాల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. ఎవరి సమస్యలు వాళ్లు తెలుసుకునే విధంగా సమాజాన్ని చైతన్యపరచాలన్నారు. తద్వారా సమాజంలోని అన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలామణి, ప్రొఫెసర్ జి.రాజమోహన్, ప్రొఫెసర్ జి.సోమశేఖర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్షప్రీతందేవ్, తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ:
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్
ఒంగోలు టౌన్:
కారాగారాలు ఖైదీలను సంస్కరించే శిక్షణాలయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. గురువారం ఒంగోలులోని జిల్లా జైలును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలు తమ తరఫున న్యాయవాదిని నియమించుకునేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఖైదీలకు అందజేస్తున్న ఆహారాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో ముఖాముఖి మాట్లాడుతూ క్షణికావేశంలో తప్పులు చేసి అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. కొంత మంది ఖైదీలు నేరాలకు అలవాటుపడుతున్నారని, మానుకోకపోతే జీవితాంతం కారాగారవాసమేనని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలుగుతూ కుటుంబ సభ్యులకు సంతోషాన్ని పంచాలని హితవు పలికారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ పి.వరుణారెడ్డి, జైలర్ ఎంఏ నాయుడు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.రాఘవులు, జైలు విజిటింగ్ న్యాయవాదులు మొబీనా, శైలజ పాల్గొన్నారు.