భార్యను కిరాతకంగా చంపిన భర్త | - | Sakshi
Sakshi News home page

భార్యను కిరాతకంగా చంపిన భర్త

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

భార్యను కిరాతకంగా చంపిన భర్త బాలిక ఆత్మహత్య కేసులో యువకుడు అరెస్టు

గిద్దలూరు రూరల్‌: భార్యపై అనుమానంతో భర్త కిరాతకంగా రోకలి బండతో కొట్టి చంపిన సంఘటన గురువారం పట్టణంలోని ఏబీఎం పాలెంలో జరిగింది. అందిన వివరాల ప్రకారం.. దాసరి ప్రేమకుమారి (30), భర్త గంగరాజుల మధ్య మాటమాట పెరిగి ఘర్షణ తలెత్తడంతో భర్త రోకలి బండతో తలపై కొట్టి చంపాడు. కొంతకాలంగా వారి మధ్య తరుచూ ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ఘర్షణ జరిగి గంగరాజు మిద్దైపె నుంచి దూకడంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లకు గాయాలపాలైన గంగరాజు ఇంట్లో ఉంటూ ప్రేమకుమారితో ఘర్షణపడ్డాడు. ఆమైపె అనుమానం పెంచుకున్న గంగరాజు ఆవేశంలో రోకలి బండతో తలపై కొట్టాడు. దీంతో ప్రేమకుమారి తీవ్ర రక్తస్రావమై వంటగదిలో మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు సీఐ కె.సురేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హతురాలి బంధువులు గంగరాజుపై దాడికి పాల్పడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. హతురాలి స్వగ్రామం చిన్నకంభం కాగా సెంట్రింగ్‌ పనిచేసుకుని జీవించే గంగరాజుకు ఆమెతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇతను దొంగ..

కాదు కాదు పిచ్చోడు!

సింగరాయకొండ: ఇళ్లలోకి చొరబడిన దుండగులను స్థానికులు కష్టపడి పట్టుకోవడం.. తీరా పోలీసులకు అప్పగించాక వారు దొంగలు కాదు పిచ్చోళ్లని చెబుతుండటం సింగరాయకొండ మండలంలో చర్చనీయాంశంగా మారింది. గురువారం తెల్లవారుజామున కనుమళ్ల పంచాయతీ పరిధిలోని చినకనుమళ్ల వడ్డెర కాలనీలోని తన్నీరు జయమ్మ అనే మహిళ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. స్థానికులు అతడిని పట్టుకునే క్రమంలో వరుసగా నాలుగు ఇళ్ల గోడలు దూకి పారిపోయేందుకు యత్నించాడు. చివరకు ఆ వ్యక్తిని దొరకబుచ్చుకుని చితకబాదిన స్థానికులు.. బైక్‌పై ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి మెడ నొక్కి దాడి చేసేందుకు దొంగ యత్నించగా స్థానికులు ఆగ్రహించి చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు. సదరు వ్యక్తిని స్టేషన్‌కు తరలించిన పోలీసులు కాసేపటికే అతను పిచ్చోడని తేల్చేయడం చర్చనీయాంశమైంది.

అనుమానిత వ్యక్తి వేలిముద్రలు పరిశీలించామని, అతను దొంగ కాదని, పిచ్చోడని చెప్పిన పోలీసులు మరో కథనాన్ని సైతం వెల్లడించారు. అనుమానితుడి వద్ద స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్న ఓ నంబర్‌కు కాల్‌ చేయగా తమది తెలంగాణ రాష్ట్రమని, పట్టుబడిన వ్యక్తి లారీ క్లీనర్‌ అని, గొడవ కారణంగా లారీ వదిలి వెళ్లాడని, పామూరులో సరుకు అన్‌లోడ్‌ చేసి వస్తున్నామని, తాము తీసుకెళ్తామని చెప్పినట్లు పోలీసులు వివరించారు. ఇదిలా ఉండగా పట్టుబడిన వ్యక్తి తనకు 3 ఎకరాల పొలం ఉంది, పాలు పితకడానికి టైమైంది, తనను పంపాలని అడుగుతున్నాడని పోలీసులు చెప్పడంతో విన్నవారంతా అవాక్కవుతున్నారు. అనుమానిత వ్యక్తి పిచ్చోడైతే వైద్యులు నిర్ధారించాలి కానీ పోలీసులు ఎలా ప్రకటిస్తారని, అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి వాస్తవాలు వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటన ఇది రెండోది కావడంతో పట్టుబడిన దొంగలంతా పిచ్చోళ్లలా నటించే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మార్కాపురం టౌన్‌: ప్రేమ పేరుతో బాలిక వెంటపడి వేధిస్తూ ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన యువకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుడి వివరాలను పట్టణ ఎస్సై సైదుబాబు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. మార్కాపురం పట్టణానికి చెందిన పదిహేనేళ్ల బాలిక ఇటీవల అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పట్టణానికి చెందిన మస్తాన్‌ వలి వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. రోజూ వెంటపడి ఇబ్బంది పెడుతుండటంతో ఎవరికీ చెప్పుకోలేక, మనస్థాపం చెంది బాలిక ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని ఎస్సై తెలిపారు.

సింగరాయకొండలో దొంగను పట్టుకున్న స్థానికులు

పిచ్చోడు.. కేసు నమోదు కుదరదన్న పోలీసులు

ఇటీవల కాలంలో ఈ తరహాలో ఇది రెండో కేసు

పిచ్చోళ్లని నిర్ధారించాల్సింది వైద్యులే కానీ పోలీసులు కాదంటున్న స్థానికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement