కొత్త జిల్లాకు ఎస్పీ కావలెను..!
భద్రత
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లా పోలీసు కార్యాలయంలో ఏడాదిన్నర కాలంగా అడిషనల్ ఎస్పీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో అడిషనల్ ఎస్పీ క్రైంగా విధులు నిర్వహించిన శ్రీధర్ బాబు నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందడంతో బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆ కుర్చీ ఖాళీగా ఉంది. జిల్లా కేంద్రంలో నేర పరిశోధనలో కీలకమైన పోస్టు భర్తీ చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా గత డిసెంబర్లో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగేశ్వరరావు కూడా బదిలీపై వెళ్లారు. దాంతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆ రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. జిల్లాలో అడిషనల్ ఎస్పీలు లేకపోవడంతో ఏదైనా అవసరమైనప్పుడు పొరుగు జిల్లాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇటీవల సింగరాయకొండ చైతన్య నవోదయ కోచింగ్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న సయ్యద్ తౌషిక్ అనే విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మరణించడం తేలిసిందే. ఈ విషయంలో న్యాయం కోసం విద్యార్థి తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్లడంతో అడిషనల్ ఎస్పీతో పునర్విచారణ చేయించాలని కోర్టు ఆదేశించింది. ఇక్కడ జిల్లాలో ఆ పోస్టుకు అధికారులు లేకపోవడంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్యకు ఆ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. అయినా సరే, కూటమి పాలకులకు పోస్టుల భర్తీ పట్టడం లేదు. జిల్లాకు అవసరమైన పోలీసు అధికారుల పోస్టులను భర్తీ చేయాల్సిన బాధ్యత వదిలిపెట్టారని ప్రజలు విమర్శిస్తున్నారు.
స్పెషల్ బ్రాంచికి డీఎస్పీ ఎప్పుడోస్తారో...
జిల్లా కేంద్రమైన ఒంగోలులో స్పెషల్ బ్రాంచి డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కళాశాలలో డీఎస్పీగా పనిచేస్తున్న సురేష్ కుమార్‌ను ఎస్బీ డీఎస్పీగా నియమించారు. అయితే, కొంతకాలానికే ఆయన రిటైరయ్యారు. మూడు నెలల నుంచి ఎస్బీ డీఎస్పీ పోస్టు ఖాళీగానే ఉంది. గుంటూరు నుంచి చిరంజీవిని డీఎస్పీగా నియమించారు. ఆయనకు పోలీసు కానిస్టేబుల్ శిక్షణ జరుగుతున్న డీటీసీ కేటాయించారు. అక్కడ పనిచేయడం ఇష్టం లేని ఆయన.. బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. దాంతో ఎంతో కీలకమైన ఎస్బీ డీఎస్పీ బాధ్యతలను సీఐ శ్రీనివాసరావు చూస్తున్నారు.
సీఐ చేతుల్లోనే ట్రాఫిక్ సిగ్నల్స్...
జిల్లా కేంద్రమైన ఒంగోలును నిత్యం ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. దానికితోడు జిల్లా కేంద్రం కావడంతో ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఇంత కీలకమైన ఒంగోలు నగరంలో ట్రాఫిక్ డీఎస్పీ పోస్టు 20 నెలలుగా ఖాళీగా ఉంది. కారణమేమిటో ఎవరికీ తెలియదు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ సీఐగా పాండురంగారావును నియమించింది. ఆయన మీద పలు ఆరోపణలు రావడం తెలిసిందే. జిల్లా ఎస్పీగా హర్షవర్థన్‌రాజు బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్ల తరువాత పాండురంగారావును వీఆర్‌కు పంపించారు. ఆయన స్థానంలో సీసీఎస్‌లో పనిచేస్తున్న జగదీష్ సీఐగా వచ్చారు. 20 నెలలుగా డీఎస్పీని నియమించకపోవడం వెనుక మతలబేమిటో పోలీసు అధికారులు సైతం చెప్పలేకపోతున్నారు.
గ్రూప్–1 వివాదాల నేపథ్యంలో...
గ్రూప్–1 వివాదాల నేపథ్యంలో కనిగిరి డీఎస్పీ యశ్వంత్‌సాయి ఈశ్వర్‌ను బదిలీ చేయడంతో అక్కడ కూడా ఇదే సమస్య నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి సబ్ డివిజన్ ప్రాంతంలో నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే కనిగిరికి డీఎస్పీ పోస్టు చాలా అవసరం. యశ్వంత్ సాయి ఈశ్వర్ స్థానంలో ఒంగోలు దిశ డీఎస్పీ వీవీ రమణ కుమార్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. జిల్లా కేంద్రం నుంచి ఆయన అక్కడకు వెళ్లాల్సి రావడం సమస్యేనని పోలీసులు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా కనిగిరికి పూర్తి స్థాయి డీఎస్పీని నియమిస్తారో.. లేకపోతే కాలయాపన చేస్తారో వేచి చూడాల్సి ఉంది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జిల్లాలో ఈ సమస్య లేదు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు విధులు నిర్వహించారు. ట్రాఫిక్ విభాగాన్ని డీఎస్పీ పర్యవేక్షించారు. ఎస్బీ డీఎస్పీగా మరియదాసు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. ఇపుడు దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో కీలక పోలీసు ఉద్యోగాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నెలల తరబడి ఖాళీగా ఉన్నాగానీ పాలకులకు కానరావడంలేదు. పైస్థాయి ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే.. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత విపరీతంగా ఉంది. ఉన్న కొద్దిపాటి సిబ్బందిపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. జిల్లాలో అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు లేకపోవడంతో శాంతి భద్రతల బాధ్యత, కేసుల విచారణలు సీఐల మీద పడ్డాయి. దీనికి తోడు బందోబస్తులు, ప్రొటోకాల్ సమస్యలతో సీఐలు సతమతమవుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోలీసు పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఎంతో అట్టహాసంగా మార్కాపురం జిల్లాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కీలకమైన అధికారులను నియమించే విషయంలోనూ అంతులేని నిర్లక్ష్యం చూపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కాపురం జిల్లా ప్రకటించి నాలుగు నెలలు కావస్తున్నప్పటికీ నేటికీ ఎస్పీని నియమించలేదు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాంతో మార్కాపురం జిల్లా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఒంగోలు రావాల్సి వస్తోంది. కొత్త జిల్లా ఏర్పాటు చేసి ప్రయోజనం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా మార్కాపురం జిల్లాకు వెంటనే కొత్త ఎస్పీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.


