పుల్లలచెరువు:
మండలంలోని పలు గ్రామాల ప్రజల ప్రధాన నీటి వనరు చిన్నకండ్లేరు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. తాగు, సాగు నీరు అందిస్తున్న ప్రాజెక్టులోని నీరు అధికారులు, నాయకుల అలసత్వంతో వృథాగా పోతోంది. మండల కేంద్రం పుల్లలచెరువులోని చిన్నకండ్లేరు ప్రాజెక్టు ప్రస్తుతం అలంకారప్రారంగా కనిపిస్తోంది. 26 అడుగుల నీటి సామర్థ్యంతో వందల ఎకరాల వైశాల్యం కలిగిన చిన్నకండ్లేరు ప్రాజెక్టు ఆయకట్టు పశ్చిమ ప్రాంతంలో కంభం చెరువు తర్వాత అతి పెద్ద చెరువుగా పేరు గాంచింది. అధికారికంగా 3 వేలు, అనధికారంగా మరో రెండు వేలు.. దాదాపు ఐదు వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. చెరువులో సమృద్ధిగా నీరు ఉంటే పుల్లలచెరువు, తెల్లగట్ల, ఉమ్మడివరం, గంగవరం, ముటుకుల, సింగుపల్లి, రెంటపల్లి తదితర గ్రామాల్లో తాగు, సాగు నీటికి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా రెండు కార్లు పంటలు పండుతాయి. సుమారు మూడేళ్ల క్రితం చెరువు లోపల గండి పడి దాదాపు సగానికిపైగా నీరు వృథాగా పోయింది. అప్పటి అధికారులు ప్రత్యక్షంగా చెరువును పరిశీలించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరకట్టారు. చెరువులో నీరు తగ్గగానే సిమెంట్ కాంక్రీట్‌తో చెరువు కట్టకు లోపల, బయట మరమ్మతులు చేస్తామని, ఇక ఇటువంటి సమస్య రాకుండా ఉంటుందని అధికారులు హామీ ఇచ్చారు. గతేడాది కురిసిన భారీ వర్షానికి చెరువులో సగానికి పైగా నీరు చేరింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతన్నల ఆశలను ఆవిరి చేస్తూ గత వారం నుంచి చెరువు కట్టకు లోపల రంధ్రం పడటంతో మళ్లీ నీరు వృథాగా పోతోంది. ఇరిగేషన్ అధికారులు బుధవారం చెరువు కట్టను పరిశీలించి గండి పడిన ప్రాంతంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయి మరమ్మతులు చేపడతామని, నీరు వృథా కాకుండా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మూడేళ్లుగా నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండిపోయిన నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికిప్పడు రైతులకు కంటి తుడుపు చర్యగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి తూతూమంత్రపు హామీలు ఇస్తున్నారు. పది గ్రామాల ప్రజలకు పుష్కలంగా తాగు, సాగు నీరందించే అతి పెద్ద చెరువు చిన్నకండ్లేరు ప్రాజెక్టు పట్ల ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఉన్నతాధికారులు పరిశీలించినా
ఫలితం శూన్యం
కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారులు చెరువును ప్రత్యక్షంగా పరిశీలించినా ఉపయోగం లేకుండాపోయింది. అప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ ఆన్సారియా, జిల్లా, రాష్ట్ర స్థాయి నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు చెరువును పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుంటామని, పూర్తిస్థాయి మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చి వెళ్లారేగానీ నేటి వరకు చెరువుపై కనీసం దృష్టి సారించిన దాఖలాలు లేవు. వేలాది ఎకరాలకు సాగు నీరు, దాదాపు పది గ్రామాల ప్రజలకు తాగు నీరు అందించే చిన్నకండ్లేరు ప్రాజెక్టు పట్ల అధికారులు, నాయకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. వాస్తవానికి తమది రైతు ప్రభుత్వమని, నీటి ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని కూటమి నాయకులు వల్లెవేస్తూ వస్తున్నారు. కొన్నాళ్లుగా చిన్నకండ్లేరు ప్రాజెక్టు సమస్యలపై మీడియాలో కథనాలు వస్తున్నా, రైతుల నుంచి సదరు శాఖ అధికారులకు, నాయకులకు విన్నపాలు అందుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అంతుచిక్కడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని నీటి వృథాను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


