నష్టాల ఘాటు.. రైతుకు చేటు.! | - | Sakshi
Sakshi News home page

నష్టాల ఘాటు.. రైతుకు చేటు.!

Nov 10 2025 8:52 AM | Updated on Nov 10 2025 8:52 AM

నష్టా

నష్టాల ఘాటు.. రైతుకు చేటు.!

పెద్దారవీడు:

సాధారణంగా రైతే రాజు అనే నానుడి వాడుకలో ఉంది. కానీ, ఆ రైతు కష్టాల్లో ఉంటే జాలిపడే వారేగానీ.. ముందుకొచ్చి అదుకునే వారు కరువయ్యారు. ప్రభుత్వం సైతం రైతులను కష్టకాలంలో ఆదుకోకపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో సాగుచేసిన ఉల్లి పంట సమృద్ధిగా పండి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయనే ఆశతో ఉన్న రైతుకు కన్నీళ్లే మిగిలాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదవడంతో చేతిదాకా వచ్చిన పంట మొత్తం నీటిలో మునిగి మొలకెత్తింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట సరిగ్గా చేతికొచ్చే సమయంలో తుఫాన్‌ రూపంలో ఆవిరైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని వాపోతున్నారు.

ఉల్లి పంట నష్టం అంచనా వేయడంలో

అధికారుల నిర్లక్ష్యం...

పెద్దారవీడు మండలంలో మోంథా తుఫాన్‌ బాధిత రైతులకు అధికారులు మొండిచేయి చూపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉల్లి పంటకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతులు మండిపడుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం రైతులను విస్మరిస్తోంది. మండల పరిధిలో పెద్దారవీడు, సిద్దినాయునిపల్లె గ్రామాల్లో రైతులు దాదాపు 100 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. ఎకరాకు పెట్టుబడి దాదాపు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టారు. కోత కోసే సమయంలో క్వింటా ధర రూ.900 పలికింది. ప్రస్తుతం క్వింటా రూ.300కు కూడా వ్యాపారులు అడగడం లేదని రైతులు వాపోతున్నారు. ఉల్లిగడ్డలు కోత కోసిన కూలి ఒక్కొక్కరికి రూ.350, గ్రేడింగ్‌ చేసిన కూలి రూ.500 చెల్లించాల్సి వస్తోంది. దాని ప్రకారం క్వింటా కూలి ఖర్చులే ఒక్కొక్కరికి రూ.900 వస్తుంటే.. మొదటి నాణ్యత ఉల్లిగడ్డలను క్వింటా రూ.300కు వాపారస్తులు అడుగుతుంటే ఎలాగని రైతులు ఆవేదన చెందుతున్నారు. దిగుబడి ఎకరాకు దాదాపు 10 క్వింటాలు కూడా రాలేదని చెబుతున్నారు. ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉల్లి పంటను రైతులు దున్నేస్తున్నారు. ఉల్లి గడ్డలను రైతులు దున్నేస్తున్నారని తెలిసి పెద్దారవీడు, బద్వీడుచెర్లోపల్లి గ్రామస్తులు వచ్చి వాటిని ఏరుకుని బస్తాల్లో నింపుకుని తీసుకెళ్తున్నారు.

రైతుల కన్నీటి పర్యంతం...

ఓవైపు వదలకుండా కురిసిన వానలు.. మరోవైపు ధర పూర్తిగా పడిపోవడంతో రాత్రీపగలూ శ్రమించినా ఉల్లి పంట కలిసి రాక నష్టాలు మిగలడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటు తుఫాన్‌, అటు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నడిసముద్రంలో మునిగి కొట్టుమిట్టాడుతున్నారు. రెక్కల కష్టంతో పాటు పెట్టుబడులు నేలపాలై అన్నదాతలకు అప్పులు, కన్నీళ్లు మిగిలాయి. పంటలు తీవ్రంగా నష్టపోయినా, ధర పతనమైనా కూటమి ప్రభుత్వం స్పందన కరువవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లి రైతులను

ప్రభుత్వం అదుకోవాలి :

రెండు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశా. దాదాపు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టా. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్‌ వచ్చింది. పంట మొత్తం నీటిలో మునిగిపోయి కుళ్లిపోయింది. క్వింటా రూ.300కు వ్యాపారులు అడుగుతున్నారు. కోత, గ్రేడిండ్‌ కూలి ఖర్చులే దాదాపు రూ.900 అవుతున్నాయి. ధర లేకపోవడంతో పెట్టుబడి ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. దీంతో ఏం చేయాలో అర్థంగాక పంటను ట్రాక్టర్‌తో దున్నివేశాను. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. గ్రామంలో రైతులంతా పంటను దున్నేందుకు సిద్ధంగా ఉన్నారు. మిరప పంట సాగుచేసేందుకు పొలాలు సిద్ధం చేస్తున్నారు.

ఆళ్ల వెంకటరెడ్డి, రైతు, పెద్దారవీడు

నష్టాల ఘాటు.. రైతుకు చేటు.! 1
1/2

నష్టాల ఘాటు.. రైతుకు చేటు.!

నష్టాల ఘాటు.. రైతుకు చేటు.! 2
2/2

నష్టాల ఘాటు.. రైతుకు చేటు.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement