జన గణనకు పైలెట్ ప్రోగ్రాం కింద ‘పొదిలి’ ఎంపిక
పొదిలి: కేంద్ర ప్రభుత్వం 2027వ సంవత్సరంలో నిర్వహించ తలపెట్టిన జన గణనకు సంబంధించి పైలెట్ ప్రోగ్రాం కింద పొదిలి నగర పంచాయతీ ఎంపికై ందని కమిషనర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నాలుగు ప్రాంతాలను ఎంపిక చేయగా వాటిలో పొదిలి ఒకటి. పొదిలిలోని 13, 14, 15, 16, 17, 18, 20 వార్డులను ఇందుకు ఎంపిక చేశారు. దీనికి సంబంధించి 21 బ్లాకులుగా ఏర్పాటు చేసి, 21 మంది ఎన్యుమరేటర్లను, 3 సూపర్‌వైజర్లను ఎంపిక చేశామని తెలిపారు. సోమవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు అన్ని గృహాలను సందర్శిస్తారన్నారు. 34 రకాల ప్రశ్నలతో కూడిన వివరాలను నమోదు చేస్తారని తెలిపారు. జన గణన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, గృహ యజమానులు ఎన్యుమరేటర్లకు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని నారాయణరెడ్డి కోరారు.
గిద్దలూరు రూరల్: పట్టణానికి చెందిన యువదర్శకుడు తేజ కల్లూరి రూపొందించిన సామాజిక లఘు చిత్రం ‘నవోదయం’ గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ కాంపిటేషన్ కు అధికారికంగా ఎంపికై ంది. ఫిల్మ్ ఫ్రీ వే ప్లాట్‌ఫారం ద్వారా జరిగిన ఎంపికలో తేజ దర్శకత్వం వహించిన ‘నవోదయం’ షార్ట్ ఫిల్మ్ ఎంపిక సమయంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. సామాజిక అవగాహన కల్పించే అంశాన్ని హృదయాన్ని హత్తుకునేలా షార్ట్ ఫిల్మ్ రూపొందించిన తేజను పలువురు అభినందించారు.
ఒంగోలు టౌన్: మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించడానికి నేడు జిల్లాకు వస్తున్న కేంద్ర బృందం పశ్చిమ ప్రకాశంలో కూడా పర్యటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పమిడి వెంకటరావు, జయంతిబాబు సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు. మోంథా తుపాను వలన పశ్చిమ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, పెద్దారవీడు, దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, తర్లుపాడు తదితర ప్రాంతాల్లో పత్తి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. గతంలో ఇదే ప్రాంత రైతులు 10 మంది మిర్చి సాగుచేసి అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన మోంథా తుపాను రైతులను కోలుకోని విధంగా నష్టాలకు గురిచేసిందని తెలిపారు. మిర్చి పంటకు ఎకరానికి రూ.50 వేలు తగ్గకుండా నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే పర్యటించడం సరికాదని, ఇలాంటి కంటితుడుపు చర్యల వలన రైతాంగానికి ఒరిగేదేమీ ఉండదన్నారు.


