ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలి
ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి, పార్లమెంట్‌పరిశీలకుడు బత్తుల సర్కారు తీరుకు వ్యతిరేకంగా 12న నిరసన ర్యాలీ
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, దీనికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమంలో అన్నీ వర్గాలు భాగస్వాములు కావాలని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ‘ప్రజా ఉద్యమం’ నిరసన ర్యాలీ పోస్టర్లను నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యంతో పాటు పేద విద్యార్థుల వైద్యవిద్య కలను సాకారం చేసే దిశగా అడుగులు వేశారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజా ఉద్యమం’ కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారన్నారు. ప్రజల నుంచి కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా వారికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవడానికి ఈ నెల 12న నెల్లూరు బస్టాండ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు వెళ్లి వినతిపత్రం అందజేస్తారని తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంచేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుతూ ‘ప్రజా ఉద్యమాన్ని’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు వై.వీ. గౌతమ్ అశోక్, మీరావలి, ధర్నాసి హరిబాబు, పిగిలి శ్రీనివాస్, కోటేశ్వరరావు, పల్నాటి రవీంద్రారెడ్డి, మల్లిశెట్టి దేవ, వేముల శ్రీకాంత్ పాల్గొన్నారు.


