వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
మద్దిపాడు: రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందామని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి మేరుగు నాగార్జున అన్నారు. మద్దిపాడులోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి నాయకులు వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ జేబులు నింపుకోవడానికి కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. వైద్య కళాశాలలు ప్రైవేటీకరిస్తే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి పేదవారు కలలు కంటారని, ఆ కలలను ధ్వంసం చేసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హయాంలో వారు చెప్పిన హామీలు ఏవీ అమలు కాకపోగా, ఉన్న అవకాశాలను సైతం పేద విద్యార్థులకు అందకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని గతంలో మాదిరి కల్లబొల్లి హామీలు చెప్పి తప్పించుకోవడం కుదరని పని అని ఆయన పేర్కొన్నారు. చేయలేని పనిని చేస్తున్నామంటూ, చేసేశామంటూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నైజం అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బలవంతంగా వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడానికి కూడా జగనన్న వెనుకాడనన్నారని ఆయన తెలిపారు. ఈనెల 12వ తేదీ నియోజకవర్గ స్థాయిలో జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీకి చెందిన నాయకులతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, నాయకులు బెజవాడ శ్రీరామ్ మూర్తి, పల్లపాటి అన్వేష్, కంకణాల సురేష్, కుమ్మరి సుధాకర్, బొమ్మల రామాంజనేయులు, పోలినేని వెంకట్రావు, మోహనరావు, అశోక్, తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


