మార్కాపురం టౌన్: వేర్వేరు ఘటనల్లో గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దొనకొండ మండలం మల్లంపేట గ్రామానికి చెందిన ఎం శ్రీనివాసరావు (20) ఈ నెల 4న మార్కాపూర్ పట్టణ శివారులోని ఒక ప్రైవేట్ కళాశాల వద్దకు వెళ్లి వ్యక్తిగత సమస్యలతో గడ్డి మందు తాగాడు. సమాచారం తెలుసుకున్న స్నేహితులు మార్కాపురం ప్రభుత్వాస్పపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరుకు తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 8వ తేదీ శనివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ సైదుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● తర్లపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన ఎం శివకుమార్ రెడ్డి (23) వ్యక్తిగత సమస్యలతో ఈ నెల 6వ తేదీన మార్కాపురం పట్టణానికి వచ్చి ఒక ప్రైవేట్ లాడ్జిలో రూము తీసుకొని గడ్డి మందు తాగాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రాథమిక చికిత్స కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి కొండారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్ల ఎస్సై సైదుబాబు చెప్పారు.
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు శాఖలో ఎస్పీ హర్షవర్థన్‌రాజు ప్రక్షాళన మొదలుపెట్టారు. అందులో భాగంగా ఒంగోలు నగరంలో పనిచేస్తున్న కొందరు సీఐలను మార్చారు. ట్రాఫిక్ సీఐ పాండురంగారావు మీద వేటు వేసి జిల్లా వీఆర్‌కు పంపించారు. పాండురంగారావు స్థానంలో సీసీఎస్ సీఐ జగదీష్‌ను నియమించారు. ఆదివారం జగదీష్ బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో ఒంగోలు టూటౌన్ సీఐగా పనిచేశారు. అదేవిధంగా మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్‌ను సీసీఎస్ ఇన్‌చార్చిగా నియమించినట్లు సమాచారం.
దర్శి: పట్టణంలోని దద్దాలమ్మ గుడి సమీపంలో నివాసం ఉంటున్న షేక్ అమీర్ బాషా (27) సాగర్ కాలువలో గల్లంతైనట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి అతను కనిపించకపోవడంతో స్నేహితులు, బంధువులను విచారించారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో గాలిస్తుండగా, అమీర్‌బాషాకు చెందిన మోటార్ సైకిల్, చెప్పులు సాగర్ కాలువ కట్టపై కనిపించాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అమీర్‌బాషా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఆ ద్విచక్రవాహనం, చెప్పులు చూసి అవి అమీర్‌బాషావేనని నిర్ధారించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకూ ఆచూకీ లభించకపోవడంతో గజ ఈతగాళ్లను పిలిపించి సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపడతామని ఏఎస్‌ఐ రాంబాబు తెలిపారు.
ఒంగోలు మెట్రో: శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఒంగోలు మంగమూరు రోడ్డులోని హరిహరసుత అయ్యప్ప క్షేత్రంలో ఆదివారం రాత్రి హరిహరసుత అయ్యప్పస్వామికి శాస్త్రోక్తంగా విళక్కు పూజ నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర పండితులు పరాంకుశ చక్రవర్తి, పరాంకుశం రంగస్వామి ఆధ్వర్యంలో నేత్రపర్వంగా క్రతువులు నిర్వహించారు. వందమంది అయ్యప్ప మాలధారులు పాల్గొని పూజలు చేసి అయ్యప్ప ఆశీసులు అందుకున్నారు.
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి


