సీఐటీయూ బలోపేతానికి కృషి చేయాలి
దర్శి: జిల్లాలో సీఐటీయూ బలోపేతానికి ప్రతినిధులు కృషి చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక పీజీఎన్ కాంప్లెక్స్ కల్యాణ మండపంలో ఆదివారం జిల్లా మహాసభలు అధ్యక్షుడు కాలం సుబ్బారావు, డీకే ఎం రఫీ, పీ కల్పన, కొర్నేపాటి శ్రీనివాసరావు అధ్యక్ష వర్గంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం కార్మిక పక్షాన సీఐటీయూ పోరాడుతుందని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలను మహాసభలు ఆమోదించాయి. అందులో జిల్లాను పారిశ్రామిక అభివృద్ధి చేసి ఉపాధి పెంచాలని, గ్రానైట్ పరిశ్రమను రక్షించాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, కార్మిక ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, పెన్షనర్స్ కనీస పెన్షన్ రూ.9 వేలుగా నిర్ణయించాలని తదితర మొత్తం 40 తీర్మానాలను సభ ఆమోదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు సీఐటీయూ పోరాటాలు కార్మికుల ఐక్యతను గురించి వివరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్, ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి, మరొక ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కంకణాల ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి జీ శ్రీనివాసులు, ఆశా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పీ కల్పన, జిల్లా కార్యదర్శి తాండవ రంగారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెల్లంపల్లి ఆంజనేయులు, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు దేవి పిచ్చయ్య, రైతు సంఘం దర్శి మండల కార్యదర్శి సందు వెంకటేశ్వరరావు, సీఐటీయూ దొనకొండ మండల కన్వీనర్ చిరుపల్లి అంజయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బోడపాటి హనుమంతరావు, స్థానిక సీఐటీయూ నాయకులు షేక్ కాలే బాష, ఉప్పు నారాయణ, జిల్లా ప్రతినిధులు 280 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు.
రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు


