సోషల్ మీడియాలో బండ్లమూడి వీడియో హల్చల్
ఒంగోలు టౌన్: చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో పోలీసుల సమక్షంలోనే దళితులపై దాడి జరగడం తెలిసిందే. సరిగ్గా గత ఆదివారం ఈ దాడి జరిగింది. బహిరంగంగా దాడి చేసిన వీడియో ఒకటి అప్పుడు బయటకు వచ్చింది. ఆ దాడికి సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో బండ్లమూడి సెంటర్లో గ్రామస్తులందరూ చూస్తుండగానే పోలీసు కానిస్టేబుల్ సమక్షంలో అగ్రకులాల వారు కర్రలు తీసుకుని దళితులను విచక్షణారహితంగా కొడుతున్న దృశ్యాలు ఒళ్లుగగుర్పాటు కలిగిస్తున్నాయి. ఈ దాడిలో ఏలిశమ్మ కిందపడిపోయి ఉంది. మిగిలిన వారిని కర్రలతో ఇష్టమొచ్చినట్లు కొడుతున్నారు. తలల మీద కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. కొట్టు కొట్టు అంటూ కేకలు వినిపిస్తున్నాయి. పోలీసు కానిస్టేబుల్ ఒక్కడే ఉండటంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ ఒక్క పోలీసు కానిస్టేబుల్ కూడా లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కంభం: గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కందులాపురం పంచాయతీలోని పూసల బజారులో నివాసం ఉంటున్న శీలం రాజ(31) రాడ్ బెండింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన అతను ఆదివారం భార్య, కుమార్తె చర్చికి వెళ్లిన సమయంలో గడ్డి మందు తాగాడు. చర్చికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన భార్య..భర్త ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి వెంటనే వైద్యశాలకు తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.


