తుపాను నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
జిల్లాలో పర్యటించిన ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం జిల్లా అధికారులతో సమీక్ష
ఒంగోలు సబర్బన్: మోంథా తుపాను నష్టాన్ని పరిశీలించేందుకు సోమవారం కేంద్ర బృందం జిల్లాకు వచ్చింది. మధ్యాహ్నం ఒంగోలుకు చేరుకున్న కేంద్ర బృందం తొలుత కలెక్టర్ ప్రకాశం భవన్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను, వీడియో క్లిప్పింగ్‌లను తిలకించారు. అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్నారు. కేంద్ర బృందంలో కేంద్ర హోం అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ పి.పౌసుమి బాసు, కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన ఎక్స్‌పెండిచర్ విభాగానికి చెందిన డిప్యూటీ డైరెక్టర్ మహేష్ కుమార్, జాతీయ రహదారుల విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శశాంక్ శేఖర్ రాయ్, ఇస్రో శాస్త్రవేత్త సాయి భగీరథ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్‌లు ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎం.శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం–దాని అనుబంధ రంగాలు, రోడ్లు భవనాలు, ఇరిగేషన్–ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ రోడ్లు, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పశుసంవర్ధక శాఖలతో పాటు ఒంగోలు నగరం పైనా ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపినట్లు కలెక్టర్ రాజాబాబు కేంద్ర బృందానికి వివరించారు.
మొత్తం కోల్పోయారుగా....
కేంద్ర బృందం అల్లూరులోని వరి పొలాలను సందర్శించింది. నీరు నిలిచిపోవడం వలన వేర్లతో సహా కుళ్లిపోయిందని రైతులు వాపోయారు. అంతా అనుకూలిస్తే సంక్రాంతి సమయానికి పంట చేతికొచ్చేదని, ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వరి దుబ్బులను తెచ్చి చూపించగా... మొత్తం కోల్పోయారుగా అని కేంద్ర బృందం సభ్యులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అల్లూరు చెరువును బృందం పరిశీలించింది. నీటి ఉధృతికి దెబ్బతిన్న కల్వర్టును పరిశీలించారు.
పత్తిపై అధిక ప్రభావం...
నాగులుప్పలపాడులో దెబ్బతిన్న పత్తి పంటను ప్రతినిధుల బృందం పరిశీలించింది. పంట పూర్తిగా దెబ్బతిందని, వేర్లకు ఫంగస్ వ్యాపించడం వలన పొలంలో మరో పంట వేసే అవకాశం కూడా ఈ సీజన్లో లేదని రైతులు చెప్పారు. జిల్లాలో ప్రధానంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు కలెక్టర్ వివరించారు. పశ్చిమ ప్రాంతంలో ఈ నష్టం అధికంగా ఉన్నట్లు తెలిపారు. పత్తి 8313, వరి 1557, సజ్జ 1388, మొక్కజొన్న 1260 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు చెప్పారు. వీటితోపాటు మినుములు 26, వేరుశనగ 17, కందులు 89 హెక్టార్లలో నష్టపోయినట్లు వివరించారు. మొత్తంగా వివిధ రకాల పంటలు జిల్లాలో 12,570 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు చెప్పారు.
ఆదుకోండి...
కేంద్ర బృందం గ్రీవెన్స్ హాలుకు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజా సంఘాల నాయకులు కలిశారు. జిల్లాకు జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేలా చూడాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ మొంథా తుఫాను వలన ప్రకాశం జిల్లాకు కలిగిన నష్టాన్ని అర్థం చేసుకోగలమని తెలిపారు. క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టం గురించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ, డీఆర్‌ఓ బీసీహెచ్.ఓబులేసు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.శ్రీనివాసరావు, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ వరలక్ష్మితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తుపాను నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం


