బాబు మరో షో..!
పామూరులోని నిమ్జ్ గాలికి.. జిల్లాలో మధ్యలోనే వదిలేసిన మరో మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులు నేడు పీసీపల్లి మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంఎస్‌ఎమ్‌ఈకి శంకుస్థాపన మరో మూడు నియోజకవర్గాల్లో కూడా వర్చువల్‌గా శంకుస్థాపనలు జిల్లాలోని ఎంఎస్‌ఎంఈలకు రూ.250 కోట్లకు పైగా రాయితీల బకాయిలు ప్రోత్సాహకాలు ఎగ్గొట్టి కొత్త వాటికి పునాదిరాళ్ల షో
ఎంఎస్‌ఎంఈలంటూ
పామూరు మండలంలోని మార్కొండాపురం వద్ద ఒక్క పరిశ్రమ కూడా లేని నిమ్జ్ ప్రాంతం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజ్ (ఎంఎస్‌ఎంఈ) పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ‘షో’కు తెరలేపారు. ఎంఎస్‌ఎంఈలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఒకటిన్నర సంవత్సరం నుంచి ఎగ్గొట్టిన చంద్రబాబు కొత్తగా ఎంఎస్‌ఎంఈలకు పునాది రాళ్లు వేయటానికి మంగళవారం జిల్లాకు వస్తున్నారు. పీసీపల్లి మండలం లింగన్నపాలెం గ్రామంలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేసి, అనంతరం అక్కడ నుంచే వర్చువల్‌గా మరో మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. కొండపి మండలం నెన్నూరుపాడు గ్రామంలో 44.31 ఎకరాల్లో రూ.15 కోట్లతో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయటానికి నిర్ణయించారు. మొదటి ఫేజ్‌లో రూ.7 కోట్లతో పనులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా యర్రగొండపాలెం మండలంలోని గంగపాలెం గ్రామంలో 32 ఎకరాల ప్రభుత్వ స్థలంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే మొదటి ఫేజ్‌లో రూ.8 కోట్లతో ఎంఎస్‌ఎంఈ పార్కుకు వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. మద్దిపాడు మండలం గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లో రూ.15 కోట్లతో ఎంఎస్‌ఎంఈల కోసం పెద్ద భవన కాంప్లెక్స్ నిర్మించనున్నారు. దానిని కూడా వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.
జిల్లాలో మధ్యలోనే వదిలేసిన మరో మూడు పార్కులు...
జిల్లాలో మరో మూడు పార్కులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఆయా ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మధ్యలో వదిలేశారు. వాటిని పట్టించుకోకుండా కొత్త ఎంఎస్‌ఎంఈ పార్కు అంటూ చంద్రబాబు పునాది రాయి వేయటానికి రావటం విడ్డూరంగా ఉందని జనం విస్తుపోతున్నారు. మార్కాపురం నియోజకవర్గం కలుజువ్వలపాడు గ్రామంలో మొదటి ఫేజ్‌లో రూ.8 కోట్లకు పైగా వెచ్చించి ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేశారు. దాంతో పాటు దర్శి మండలంలోని చందలూరు గ్రామంలో ఎంఎస్‌ఎంఈ పార్కును కూడా రూ.8 కోట్లతో చేపట్టిన పనులు, మౌలిక వసతులు మధ్యలోనే ఆపేశారు. అదేవిధంగా దొనకొండ మండలం రాగమక్కపల్లిలో కూడా దాదాపు రూ.5 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు గ్రహణం పట్టింది.
రూ.250 కోట్ల రాయితీలకు ఎగనామం...
జిల్లాలో ఎంఎస్‌ఎంఈలకు రావాల్సిన రూ.250 కోట్ల రాయితీలకు చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. జిల్లాలో మొత్తం 1,200 పరిశ్రమలకు రావాల్సిన సబ్సిడీ ఇంత వరకు ఇవ్వకుండా చంద్రబాబు సర్కారు పారిశ్రామికవేత్తలను నిలువునా మోసం చేస్తోంది. అందులో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 970 పరిశ్రమలకు రూ.170 కోట్ల రాయితీలు రావాల్సి ఉంది. మిగతా ఖాదీ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖాదీ కమిషన్‌కు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమలు కాగా ఇతర పరిశ్రమలు కూడా అనేకం ఉన్నాయి. రాయితీలు రాక, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు అందక జిల్లాలో దాదాపు 400 పరిశ్రమలకు పైగా మూతపడగా మరో 300 పరిశ్రమల వరకు మూత దిశగా అడుగులు వేస్తున్నాయి. జిల్లాలో గ్రానైట్‌తో పాటు అనేక రకాల పరిశ్రమలు మూతపడనున్నాయి. పారిశ్రామికంగా ఎంఎస్‌ఎంఈలను ప్రభుత్వం ప్రోత్సహించకపోవటంతో పాటు హక్కుగా రావాల్సిన సబ్సిడీలు కూడా ఇవ్వకుండా వేధించటమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలో ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమ కార్మికులకు ఉపాధిని కల్పిస్తోంది. అలాంటి గ్రానైట్ పరిశ్రమ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. మొత్తం మీద గతంలో శంకుస్థాపనలు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయకపోగా కొత్తగా మళ్లీ ఎంఎస్‌ఎంఈ పార్కులంటూ చంద్రబాబు గారడీ చేస్తుండటంపై జనం మండిపడుతున్నారు.


