సెకండ్ ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలి
ఒంగోలు టౌన్: 18 ఏళ్లుగా సెకండ్ ఏఎన్‌ఎంలుగా సేవలందిస్తున్నప్పటికీ రెగ్యులర్ చేయకపోవడం దారుణమని, వెంటనే అన్నీ అర్హతలు కలిగిన సెకండ్ ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నీ రకాల పరీక్షలు రాసి ఏఎన్‌ఎంలుగా ఎంపికై నా మినిమం టైం స్కేల్ ప్రకారం వేతనం చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. చివరికి రిటైర్‌మెంట్ బెనిఫిట్ లేకుండా చేయడం వెట్టి చాకిరి చేయించుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనిఫాం బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఏఎన్‌ఎంల చేత పని చేయించుకుంటున్నారన్నారు. సెకండ్ ఏఎన్‌ఎంల కంటే తరువాత చేరిన వారిని రెగ్యులర్ చేశారని, సెకండ్ ఏఎన్‌ఎంలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై నా సచివాలయాల్లో ఖాళీలు భర్తీ చేసే సమయంలో సెకండ్ ఏఎన్‌ఎంలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ ఐక్య పోరాటాల ద్వారానే సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 24వ తేదీ వైద్య శాఖ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాలను మెయిల్ రూపంలో పంపించాలని చెప్పారు. డిసెంబర్లో విజయవాడలో జరిగే దీక్షలో పెద్ద సంఖ్యల సెకండ్ ఏఎన్‌ఎంలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు లీల, మరియమ్మ, మల్లేశ్వరి, రవి కుమారి, యాస్మిన్, కోటమ్మ పాల్గొన్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓకు వినతి పత్రం అందజేశారు.


