రెండు లారీలు ఢీ
● డ్రైవర్‌కి తీవ్రగాయాలు
వేటపాలెం: జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఢీకొట్టిన లారీ డ్రైవర్ తీవ్రగాయాల పాలయ్యాడు. 216వ నంబర్ జాతీయ రహదారి బైపాస్‌లో వేటపాలెం మండలంలోని అక్కాయిపాలెం వద్ద అఖిల ట్రేడర్స్ గోడౌన్ సమీపంలో శనివారం ఆర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు నుంచి చీరాల వైపు లోడుతో ఓ లారీ వెళ్తోంది. దాని వెనుక మరో ఖాళీ లారీ వేగంగా వెళ్తోంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఢీకొట్టిన లారీ నడుపుతున్న డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న వేటపాలెం ఎస్సై జనార్దన్ సంఘటన స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మురళిని బయటకు తీసి చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.


