
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
ఒంగోలు వన్‌టౌన్: మండల అభివృద్ధి అధికారులు వారి ప్రధాన కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.రాజాబాబు హెచ్చరించారు. ఎస్సీ ప్రజలు మెజార్టీగా ఉండే గ్రామాల్లో ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన (పీఎం – ఏజేఏవై) అమలుపై శుక్రవారం ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందడమంటే జిల్లా అభివృద్ధి చెందడమేనన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్ మాట్లాడుతూ పీఎం – ఏజేఏవై కింద గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, సామాజిక భద్రత, గ్రామీణ రోడ్లు, ఇళ్ల నిర్మాణం, విద్యుత్, మెరుగైన వ్యవసాయ విధానాలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి పెంపు, జీవనోపాధి కల్పన వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం సర్పంచ్ అధ్యక్షతన ఏర్పడే కమిటీలో గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తారని తెలిపారు. ఈ విధంగా గుర్తించిన పనులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో చేపడతారన్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, పనులను కూడా గుర్తించినప్పటికీ వాటిని చేపట్టడంలో జాప్యం జరుగుతోందని ఆయన తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎంపీడీవోలు అంటేనే మండల స్థాయిలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ అధికారులని, మీ ప్రధాన విధిపై దృష్టి సారించకుండా ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. పథకాలను పర్యవేక్షిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మొక్కుబడిగా పనిచేస్తామంటే కుదరదని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, డీఈవో కిరణ్ కుమార్, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్‌ఈ వరలక్ష్మి, ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజాబాబు