
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూటమి సర్కారు కుట్ర
పెద్దదోర్నాల: వైఎస్ జగన్ హయాంలో చేసిన అభివృద్ధిని కప్పెట్టడంతోపాటు తన అనుచరులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, గత టీడీపీ ప్రభుత్వ జమానాల్లో షుగర్ ఫ్యాక్టరీలు, నూలు మిల్లులను అడ్డగోలుగా అమ్మేశారని దుయ్యబట్టారు. శుక్రవారం పెద్దదోర్నాల మండల పరిధిలోని ఎగువ చర్లోపల్లి, పెద్దబొమ్మలాపురం గ్రామాల్లో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తాటిపర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీల్లో 7 ప్రారంభం కాగా 10 కాలేజీలు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. జగనన్న చేసిన అభివృద్ధిని చూడలేక ఆయన చేపట్టిన ప్రాజెక్టులను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం కళ్లు తెరిచేలా చేయడమే కోటి సంతకాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. కార్యక్రమంలో నాయకులు చిట్టె వెంకటేశ్వరరెడ్డి, గుమ్మా యల్లేష్, అల్లు రాంభూపాల్‌రెడ్డి, వల్లభనేని పవన్‌కుమార్, మొద్దు తిరుపతిరావు త్రిపురాంతకం నాయకులు ఆళ్ల కృష్ణారెడ్డి, సింగా ప్రసాద్, యర్రగొండపాలెం సర్పంచ్ అరుణాబాయి, అల్లు రాంకోటిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శ
ప్రైవేటీకరణకు నిరసనగా చర్లోపల్లిలో కోటి సంతకాల సేకరణ