
కూటమిది దివాలాకోరు ప్రభుత్వం
ఒంగోలు సిటీ: ఈ ఏడాది మాగాణి రైతు మొదలుకుని శనగ, మిర్చి, పొగాకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక తీవ్రంగా నష్టపోయారని, కూటమి ప్రభుత్వం 18 నెలలుగా ఏ ఒక్క రైతునీ ఆదుకోలేదని, ఇది దివాలా కోరు ప్రభుత్వమని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు సీజన్లకు చెందిన శనగ పంటకు గిట్టుబాటు ధర లభించక కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ఎదురైతే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే క్వింటాకు రూ.1500 చొప్పున బోనస్ ఇచ్చి ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాల చొప్పున తెల్ల శనగలను క్వింటా రూ.12 వేలకు, ఎర్రశనగలను క్వింటా రూ.10 వేలకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ నమోదు, పంటల బీమా అమలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించి ఆదుకున్నారని వివరించారు. తద్వారా ఐదేళ్ల పాటు అన్ని వర్గాల రైతులు లబ్ధిపొందినట్లు వివరించారు. కానీ, కూటమి ప్రభుత్వం రైతులన్నా, పంటలకు గిట్టుబాటు ధరలన్నా చులకనగా చూస్తోందని విమర్శించారు. రైతుల గురించిగానీ, పంటల గురించిగానీ కూటమి ప్రభుత్వానికి, పాలకులకు పట్టడం లేదని ధ్వజమెత్తారు.
దయనీయంగా పొగాకు రైతు పరిస్థితి...
ఈ ఏడాది పొగాకు రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చుండూరి రవిబాబు అన్నారు. ప్రతి రైతుకు బ్యారన్‌కు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల బ్యారన్ల ద్వారా రూ.2200 కోట్లు విదేశీ మాదకద్రవ్యం సమకూరుస్తున్న పొగాకు రైతును కూటమి ప్రభుత్వం చులకనగా చూస్తోందని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందినట్లు ఆరోపించారు. బర్లీ పొగాకు కొనుగోలు ప్రక్రియలో కూటమి అనుయాయులకు చెందినవి కొనుగోలు చేయడం వివక్షపూరిత చర్యగా ఆరోపించారు. గత ప్రభుత్వం పార్టీలకు అతీతంగా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. వ్యవసాయం వృథా అని భావించే కూటమి పాలకులు.. ఏ పంట సాగుచేయాలో, ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి శనగలకు క్వింటాకు రూ.3 వేలు బోనస్ ప్రకటించి తెల్ల శనగలు రూ.10 వేలకు, ఎర్రశనగలు రూ.8 వేలకు కొనుగోలు చేయాలని చుండూరి రవిబాబు డిమాండ్ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించి పంటలు కొనుగోలు చేస్తే వ్యవసాయం అభివృద్ధి చెంది తద్వారా సంపద పోగవుతుందని తెలిపారు. రైతుకు నష్టం చేకూరిస్తే సంపద అవిరవుతుందని గుర్తించాలని హితవు పలికారు. రైతుకు న్యాయం జరిగేంత వరకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జోనల్ అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రరెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, నాయకులు దామరాజు క్రాంతికుమార్, నాసర్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి, డి.కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.
రైతాంగాన్ని ఆదుకోలేని చేతగాని ప్రభుత్వం
హామీల అమలులో ఘోరంగా విఫలం
గిట్టుబాటు ధర లేక రెండేళ్లుగా కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్న శనగలు
నష్టపోయిన రైతులు
శనగలకు రూ.3 వేలు బోనస్ ప్రకటించాలి
వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు డిమాండ్