
పచ్చ నేతలకు మేతగా నిర్వాసితుల ప్యాకేజీ
వెలిగొండ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కావాలంటే పైకం ముట్టచెప్పాల్సిందే రూ.కోట్లు వసూలుకు స్కెచ్ గీసిన కూటమి నాయకుడు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం
యర్రగొండపాలెం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ప్యాకేజీ పచ్చనేతలకు మేతగా మారిందని, అధికారులు, టీడీపీ నాయకులు కలిసి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని అతిపెద్ద స్కాంగా మార్చుకున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలోని పెద్దారవీడు మండలం సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల నిర్వాసితులు శుక్రవారం ఆయనతో కలిసి తమకు జరుగుతున్న అన్యాయం గురించి చర్చించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే జేసీ, ఎస్‌డీసీలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్కొక్క నిర్వాసితుడి నుంచి రూ.20 వేల ప్రకారం మొత్తం రూ.10 కోట్లు వసూళ్లకు సిద్ధమయ్యారని, పైకం ఇచ్చిన వారికే అవార్డు వస్తుందని లేకుంటే ఆ అవార్డును నిలిపేస్తారని టీడీపీ నాయకులు బాహాటంగా నిర్వాసితులను ఆందోళనకు గురిచేస్తూ.. అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, కొంతమంది నిర్వాసితుల నుంచి డబ్బు కూడా వసూలు చేశారని ఆయన అన్నారు. కూటమి దోపిడీకి అద్దంపట్టే ఈ వ్యవహారాన్ని అతిపెద్ద స్కాంగా పరిగణించాలని ఆయన సంబంధిత జిల్లా అధికారులను కోరారు. దాదాపు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయినప్పటికీ నిర్వాసితుల నమోదు కార్యక్రమం పెండింగ్‌లో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, ఆయా పంచాయతీల్లో మొత్తం నిర్వాసిత కుటుంబాలు 5,126 ఉన్నాయని, వారిలో 3,760 కుటుంబాలకు అవార్డు లభించిందని, మిగిలిన 1,360 కుటుంబాలను పెండింగ్‌లో పెట్టారని ఆయన అన్నారు. నిర్వాసితుల కుటుంబాలను 20 ఏళ్ల క్రితం గజిట్‌లో నమోదు చేసి నేటికీ అవార్డు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని, దీనివెనక అతిపెద్ద కుట్ర దాగిఉందన్న విషయం అందరికీ తెలుసన్నారు. వీరిని ఏదో కారణం చూపించి అప్పటి అధికారులు, టీడీపీ నాయకులు అవార్డు చేయకుండా ఈ వ్యవహారాన్ని అవినీతి అవసరంగా మలుచుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అప్పటి కలెక్టర్, ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్, జేసీల దృష్టికి పలు దఫాలుగా తీసుకెళ్లినా పరిష్కరించకపోవడంలో ఉన్న మతలబు ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం, 4 జిల్లాలకు చెందిన ప్రజలకు తాగు, సాగు నీరు అవసరాలు తీర్చాలన్న సదుద్దేశంతో నిర్వాసితులు తమ ఉనికి, పుట్టిన గడ్డపై ఉన్న బంధాలు సైతం వదులుకున్నారని ఆయన అన్నారు. అటువంటి నిర్వాసితులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని, వారిపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అవినీతి దాహాన్ని తీర్చుకోవటానికి సిద్ధం అయ్యాడని ఆయన విమర్శించారు.