
మహిళలు పారిశ్రామిక రంగంలోనూ అభివృద్ధి చెందాలి
జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసరావు
ఒంగోలు సబర్బన్: మహిళలు పారిశ్రామిక రంగంలోనూ అభివృద్ధి చెందాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. స్థానిక పాత గుంటూరు రోడ్డులోని జనశిక్షణ సంస్థ(జేఎస్‌ఎస్) కార్యాలయంలో శుక్రవారం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ శివ సాయి ఐటీఐలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశామన్నారు. మహిళలు తాము శిక్షణ పొందిన రంగాల్లో పరిశ్రమలను స్థాపించాలని ఆయన ఆకాంక్షించారు. సూక్ష్మ, మధ్యతరహా, భారీ పరిశ్రమలకు సబ్సిడీ ద్వారా వివిధ రకాలైన రుణాలను పీఎంఈజీపీ అందజేస్తుందన్నారు. దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శివసాయి ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కే.శ్రీనివాసరావు, జనశిక్షణ సంస్థ ప్రోగ్రాం ఆఫీసర్ శ్యామ్ సునీల్, మరో ప్రోగ్రాం ఆఫీసర్ హరికృష్ణ, సంస్థ సిబ్బంది శివకృష్ణ, దుర్గాప్రసాద్‌తో పాటు శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు.