
అక్రమ వసూళ్లు
ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేసేందుకు రూ.10 కోట్ల వసూళ్లకు తెరలేపిన టీడీపీ నేతలు వెలుగొండపై చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వం అక్రమ వసూళ్లు ఆపకపోతే వేలాదిమందితో ధర్నా చేస్తా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలను టీడీపీ నేతలు వసూలు చేస్తున్నారని, ఈ అక్రమ దందాను ఆపకపోతే వేలాది మందితో ధర్నా చేస్తానని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ హెచ్చరించారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టరును శనివారం ఆయన కలిసి మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2005 నుంచి గెజిట్‌లో పేరున్నా అవార్డుకాని వారి సంఖ్య దాదాపు 1350 మంది ఉన్నారన్నారు. గెజిట్‌లో పేర్లు ఉన్న వారికి అవార్డు ఇచ్చేందుకు మీకున్న సమస్య ఏమిటన్నారు. అధికారులు 2005 నాటి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులు తెమ్మంటూ నిర్వాసితులను ఇబ్బంది పడుతున్నారని, అవి లేనివారి పరిస్థితి ఏమిటని అన్నారు. అన్నీ కార్డులు ఉన్నా సుమారు 900 మందికి అవార్డు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు నిర్వాసితులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ చెప్పారు. ఒక్క కొత్తపేరు కూడా అవార్డుకు ఎంపిక కాలేదని, ఇచ్చిన అరకొర నిధులు కూడా టీడీపీకి చెందిన వారికే విడుదల చేయించుకోవడం తప్ప ఆయా గ్రామాల్లో నివశిస్తున్న అర్హులైన వారికి ఒక్కరికి కూడా సహాయం చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేనట్టుందన్నారు. సుమారు 5 వేల మంది నిర్వాసితులు ఉన్నారని, వారందరికీ ఒకేసారి ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా కొంతమందికే ఇచ్చి 1300 మంది నిర్వాసితులను వదిలేస్తే వారికి ఎప్పుడు అవార్డు ఇస్తారని అన్నారు. ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, ఓటరు కార్డులను తీసుకొచ్చి వివరాలను అధికారులకు చెప్పానని అన్నారు. ఒక నెలలోనే ఈ ప్రక్రియ పూర్తిచేస్తానని స్పెషల్ డిప్యూటీ కలెక్టరు చెప్పారని అన్నారు.
పైసలిస్తేనే పరిహారం
కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి 18 నెలలు కావస్తున్నా ఇంత వరకూ వెలుగొండను ఎందుకు పూర్తిచేయలేదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తి చేయలేరా అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. రాజకీయ కక్షలతో నిర్వాసితులను ఇబ్బందిపెట్టడం తగదన్నారు. టీడీపీ నాయకులు ప్రతి వ్యక్తి వద్ద నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల పేర్లు చెప్పి రూ.20 వేలు డబ్బులు ఇస్తేనే పేర్లు పొందుపరుస్తామని, డబ్బులివ్వకుంటే అవార్డులో పేరున్నా మీకు డబ్బులు రావంటూ బెదిరిస్తున్నారని అన్నారు. 7 వేల మంది వరకూ నిర్వాసితులు ఉన్నారని, ఒక్క యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచే 5 వేల మంది ఉన్నారని, దాదాపు రూ.10 కోట్లను టీడీపీ నాయకులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివన్నీ ఇక్కడున్న ఇన్‌చార్జికి పట్టవని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్షన్‌లలో బిజీగా ఉంటారే తప్ప ప్రజల కోసం పనిచేసే ఆలోచనే చేయడన్నారు. వెలుగొండ ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలపై పదే పదే చెబుతున్నా ఈ పెద్దమనిషి నోరు విప్పడన్నారు. ఎందుకంటే వచ్చే కమీషన్ పోతుందేమోనని అన్నారు. ఆయన వెంట పెద్దారవీడు మండల పార్టీ కన్వీనర్ పీ కృష్ణారెడ్డి, సుంకేశుల సర్పంచ్ రమేష్, నాగిరెడ్డి, పుల్లారెడ్డి, సహదేవుడు, రమణారెడ్డి ఉన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే తాటిపర్తి
ఒంగోలు సబర్బన్: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కలెక్టర్ పీ రాజాబాబు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ను ఆయన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. అనంతరం కలెక్టర్‌తో ఎమ్మెల్యే తాటిపర్తి యర్రగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ అరాచకాలు, అక్రమాలు, అవినీతి గురించి వివరించారు. కలెక్టరేట్‌లో తాటిపర్తి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. యర్రగొండపాలెంలో టీడీపీ ఇన్‌చార్జ్ చేస్తున్న అవినీతిని, అక్రమాలను, దౌర్జన్యాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నియోజకవర్గంలో కుంటుపడుతున్న అభివృద్ధి గురించి కూడా వివరించానన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను టీడీపీ యర్రగొండపాలెం ఇన్‌చార్జ్ దోచుకుంటున్నాడన్నారు. నిర్వాసితుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. డబ్బులు ఇస్తేనే నిర్వాసితుల పేర్లు నమోదు చేసి నిధులు మంజూరు చేయిస్తున్నాడని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 1,300 మందికి ఆర్‌ఆర్ ప్యాకేజీ మంజూరు కాలేదని, కనీసం అవార్డు కూడా కాకుండా టీడీపీ ఇన్‌చార్జ్ అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు.

అక్రమ వసూళ్లు