సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వ చర్యలతో పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. ఎంఎస్‌ఎంఈలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు ఎగనామం పెట్టడం, విద్యుత్ బిల్లులు, రాయల్టీల భారంతో పరిశ్రమలను నడపలేక పారిశ్రామికవేత్తలు ఫ్యాక్టరీలను మూతేసుకుంటున్నారు. జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రావాల్సిన రాయితీలను ఇంత వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఉన్న వాటికి రాయితీలు ఇవ్వకుండా ప్రోత్సాహకాన్ని గాలికి వదిలేసి కొత్తవాళ్లను ప్రోత్సహిస్తాననటంలో పరమార్థం ఏమిటో సీఎం చంద్రబాబుకే తెలియాలి.
రూ.250 కోట్ల రాయితీల ఎగనామం...
జిల్లాలో ఎంఎస్‌ఎంఈలకు రావాల్సిన రూ.250 కోట్ల రాయితీలకు చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. జిల్లాలో మొత్తం 1,200 పరిశ్రమలకు రావాల్సిన సబ్సిడీ ఇంత వరకు ఇవ్వకుండా పారిశ్రామికవేత్తలను నిలువునా మోసం చేస్తోంది. అందులో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 970 పరిశ్రమలకు రూ.170 కోట్ల రాయితీలు రావాల్సి ఉంది. మిగతా ఖాదీ బోర్డు, ఖాదీ కమిషన్‌కు చెందిన పరిశ్రమలున్నాయి. వీటిలో ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమలు కాగా ఇతర పరిశ్రమలు కూడా అనేకం ఉన్నాయి.
500 పరిశ్రమల వరకు మూత దిశగా అడుగులు:
జిల్లాలో గ్రానైట్‌తో పాటు అనేక రకాల పరిశ్రమలు మూత దిశగా అడుగులు పడుతున్నాయి. పారిశ్రామికంగా ఎంఎస్‌ఎంఈలను ప్రభుత్వం ప్రోత్సహించకపోవటంతో పాటు హక్కుగా రావాల్సిన సబ్సిడీలు కూడా ఇవ్వకుండా వేధించటమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలో ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమ కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. అలాంటి గ్రానైట్ పరిశ్రమ పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా తయారైంది. ఇప్పటికే 400లకు పైగా గ్రానైట్ పరిశ్రమలు మూత పడగా, మరో 50 నుంచి 60 వరకు మూత దిశగా అడుగులు పడుతున్నాయి. మూత పడే దిశలో మరికొన్ని రకాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. చీమకుర్తి మండలంతో పాటు సంతనూతలపాడు, పేర్నమిట్ట, మద్దిపాడు మండల గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్లలో మూతపడిన ఫ్యాక్టరీలకు కొన్నింటికి తాళాలు వేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్టూరు, బల్లికురవ మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. నష్టాలపాలై పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. రాయితీ వస్తుందని బ్యాంకుల్లో రూ.కోట్లలో రుణాలు తీసుకొని ఫ్యాక్టరీలు స్థాపిస్తే ప్రభుత్వ ప్రోత్సాహం లేక, రాయితీలు విడుదల చేయకపోవటంతో పారిశ్రామికవేత్తలు అప్పుల్లో కూరుకుపోయారు.
రాయల్టీ వసూలు ఏఎంఆర్ సంస్థకు అప్పగించి మరీ భారం:
రాష్ట్ర ప్రభుత్వం అసలే కష్టకాలంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమపై మరో భారం మోపింది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మైనింగ్ రాయల్టీ వసూళ్లు ప్రైవేట్ ఏఎంఆర్ సంస్థకు లీజుకు ఇచ్చింది. దాంతో గ్రానైట్ పరిశ్రమల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. గతంలో బ్లేడుకు రూ.27 వేలు చార్జీ ఉంటే దానిని రూ.35 వేలకు పెంచింది ఏఎంఆర్ సంస్థ. లీజు పొందిన సంస్థ అదనంగా వసూళ్లకు పూనుకుంటున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ యజమానులు అక్టోబర్ 1 నుంచి సమ్మెలోకి వెళ్లి ఫ్యాక్టరీలు బంద్ చేశారు. కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వ భారాలతోపాటు ముడిరాయి కొనుగోలు ఖర్చులు పెరిగాయి. ఫినిష్ చేసిన స్లాబుల ఎగుమతి లేక, అంతర్గత మార్కెట్ లేక జిల్లాలో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. కొన్ని 3 షిఫ్ట్‌లు కాకుండా ఒక్క షిప్ట్ మాత్రమే నడుపుతూ నెట్టుకొస్తున్నాయి. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి ఈ విధంగా భారం మోపడం వల్ల, పెద్ద పరిశ్రమల పోటీకి తట్టుకోలేక మూతవేసుకోవాల్సిన స్థితిలో యజమానులు సతమతమవుతున్నారు.
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది
గ్రానైట్ ఫ్యాక్టరీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సకాలంలో రాయితీలు ఇచ్చిన ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక వేత్తలను ఆదుకోవటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 17 నెలలు పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాయితీలు విడుదల చేయలేదు. దానికితోడు ప్రభుత్వం వసూలు చేయల్సిన రాయల్టీని ప్రైవేటు ఏఎంఆర్ సంస్థకు అప్పగించింది. – కాలం సుబ్బారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు
వెలుగొండ నిర్వాసితుల నుంచి
త్వరలో రాయితీలు విడుదలవుతాయి
జిల్లాలో ఎంఎస్‌ఎంఈలకు రావాల్సిన రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రాయితీలు విడుదల చేయటానికి సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసినట్లు సమాచారం. వచ్చే నెలలో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ పారిశ్రామిక సమ్మిట్ జరగనుంది. ఈ లోగా అందరికీ రాయితీలు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నాం.
– బి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం
పరిశ్రమలకు తాళం