
కిల్కారి సేవలను ఉపయోగించుకోవాలి
ఒంగోలు సిటీ: కిల్కారి సేవలను గర్భిణులు, బాలింతలు ఉపయోగించుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులో జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో శుక్రవారం ఆశ నోడల్ ఆఫీసర్లకు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. కిల్కారి సేవలతో పాటు ఆడపిల్లను పుట్టనిద్దాం – ఆడపిల్లని చదివిద్దాం అనే అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కిల్కారి కాల్ వచ్చినపుడు ప్రతి సమాచారాన్ని పూర్తిగా గర్భిణులు, బాలింతలు వినేలా చూడాలన్నారు. తద్వారా ప్రతి గర్భిణీ, బాలింతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కిల్కారి ప్రోగ్రాం ప్రవేశపెట్టిందన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గర్భిణికి నాలుగో నెల మొదలుకుని పుట్టిన బిడ్డకు ఏడాది నిండేంత వరకు వారానికి ఒకసారి రెండు నిమిషాల్లోపు నిడివి గల కిల్కారి కాల్స్ వస్తాయని, తల్లీబిడ్డల ఆరోగ్య క్షేమ సమాచారం తెలియజేస్తాయని తెలిపారు. దీనిపై ఆశ నోడల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు పీహెచ్‌సీల పరిధిలోని గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ కమలశ్రీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దాసరి శ్రీనివాసులు, ఆరోగ్య విద్య విస్తరణ అధికారి రాజేశ్వరి, డీసీఎం, కిల్కారి రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ బి.రాజు పాల్గొన్నారు.