
అబద్ధపు హామీలతో బాబు వంచన
సభలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
సభాప్రాంగణానికి ర్యాలీగా వస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు
పెద్దదోర్నాల: ఎన్నికల్లో అలివికాని హామీలిచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. శ్రీశైలం రహదారిలోని మల్లికార్జున ఎస్టేట్స్‌లో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మండల పార్టీ కన్వీనర్ గంటా రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవక ముందు ఒక్కొక్క ఇంటికి రూ.6 లక్షలు ఇస్తామంటూ చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు. ఆరు హామీలతో పాటు మరో 143 అదనపు హామీలు జూలై 24 నుంచి అమలవుతాయని మోసం చేశారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ కులాలు, సినిమాలను అడ్డు పెట్టుకున్నారని, అడ్డగోలు హామీలతో, ఒక జెండా, అజెండా లేని పవన్ కళ్యాణ్‌తో పొత్తులు పెట్టుకొని ప్రజలను మోసం చేశారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ప్రతి ఒక్క మహిళకు రూ.18 వేల ఆర్థిక సహాయం, తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క బిడ్డకు రూ.15 వేలు, ఉచిత ఇసుక, రైతు భరోసాను పేరు మార్చి అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతులకు డబ్బులు ఈ విధంగా ఎన్నో పథకాలు అందిస్తామంటూ బాండ్లు కూడా ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ అబద్ధపు హామీలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు.
వెలిగొండ ప్రాజెక్టుపై కూటమి నిర్లక్ష్యం:
తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంతానికి సంజీవని అయిన వెలిగొండ ప్రాజెక్టును దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి తీసుకొచ్చారని, ఆయన తనయుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆ ప్రాజెక్ట్‌కు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి జాతికి అంకితం చేశారని అన్నారు. కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించి ముంపు గ్రామాల ప్రజలను అక్కడ నుంచి తరలిస్తే శ్రీశైలం డ్యాం నుంచి పుష్కలంగా వచ్చే నీటి వరద ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేదని అన్నారు. సముద్రంలో వృథాగా కలిసే 30 టీఎంసీల నీటితో నల్లమల సాగర్ నీటితో కళకళలాడేదని ఆయన పేర్కొన్నారు. కేవలం మీ చాతగాని, దద్దమ్మ కూటమి పాలన వల్ల నిధులు కేటాయించలేకపోయారని విమర్శించారు. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి సభలు పెట్టడం చంద్రశేఖర్ మీద సవాళ్లు విసరటం కాదని, దమ్ముంటే మీ పరిపాలనపై ఇప్పుడే డిబేట్ చేద్దామని ఆయన సవాల్ విసిరారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రికి ఇక్కడి కష్ట సుఖాలు ఏం తెలుసో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో పని చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రికి ఇక్కడి సమస్యలపై 12 లెటర్లు ఇచ్చానని, ఆయన ఎంత మాత్రం స్పందించి ఇక్కడ పనులు చేశారో చెప్పాలన్నారు.
ఆర్టీసీ బస్టాండ్ మీ అబ్బ సొత్తా..
తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని ఆర్టీసీ బస్టాండ్‌లో పెట్టుకోవటానికి అదేమన్నా మీ అబ్బ సొత్తా అంటూ ఎమ్మెల్యే తాటిపర్తి ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. ఇన్‌చార్జి అని పేరు పెట్టుకున్న ఓ నేత నియోజకవర్గాన్ని లూటీ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు తిరగబడటం మొదలు పెడితే వీళ్లందరి పంచెలు ఊడి పోతాయని హెచ్చరించారు. ప్రజలకు మీరు సేవ చేస్తారన్న ఆశతో మంచి అవకాశం ఇచ్చారని, కానీ రాబందులుగా మారి ప్రజలను దోచుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో 20 ఏళ్ల క్రితం వేసిన పైపులైనును జేసీబీలతో తవ్వుకుని రూ.25 కోట్లు దోచుకునేందుకు ప్లాన్ వేశారని, తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే ఒక కిలో మీటర్ తవ్వేందుకు అనుమతి ఇచ్చామని అధికారుల చెప్పారన్నారు. ఒక నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ను మరో నియోజకవర్గంలో వేసేందుకు అనుమతులు ఉంటాయా అని అయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీని నిర్వహించిన ఎమ్మెల్యే తొలుత నటరాజ్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మోటారు బైక్ ర్యాలీతో సభాప్రాంగణానికి చేరుకున్నారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ మజీద్, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షులు దొందేటి నాగేశ్వరరెడ్డి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి గుమ్మా పద్మజా యల్లేష్, ఎస్టీ నాయకులు డుమావత్ లతా చంద్రకాంత్‌నాయక్, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి దూదేకుల రసూల్, పుల్లలచెరువు పార్టీ నాయకుడు ఉడుముల శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
ఆరు హామీలతో పాటు మరో అదనపు హామీలంటూ మోసం మీ ఇంటికే నేరుగా డబ్బులు అందుతాయని అబద్ధపు హామీలు బాబు మోసాలను ఎండగట్టిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్