
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
యర్రగొండపాలెం: అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక శివాలయం కమ్యూనిటీ హాలులో ఆదివారం మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు నియోజకవర్గాల్లో కంపెనీకి చెందిన వేలాది ఎకరాల భూములు అగ్రిగోల్డ్ యాజమాన్యం డైరెక్టర్ల పేరుతో ఉన్నాయని, అవ్వా కుటుంబ సభ్యుల పేర్లతో ఎక్కువగా భూములు ఉన్నాయని, అవ్వా వెంకటరామారావు చైర్మన్‌గా, తన సోదరులు 8 రాష్ట్రాల్లో 32 లక్షల మందిని నిలువునా ముంచేశారని అన్నారు. కోర్టు పేరుతో తప్పుడు పద్దతుల్ని అవలంబిస్తూ ప్రభుత్వాన్ని, బాధితులను మోసంచేసి ఆస్తులను కొల్లగొట్టటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. యాజమాన్యం ఆస్తులను కొల్లగొట్టినా, సీఎం చంద్రబాబు సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పినా అగ్రిగోల్డ్ బాధితులకు మాత్రం న్యాయం జరగదని అన్నారు. బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై సానుకూల ఒత్తిడి తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఒక గంట అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై దృష్టి పెడితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. సమావేశంలో అగ్రిగోల్డ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కేవీవీ.ప్రసాద్, అగ్రిగోల్డ్ బాధిత సంఘ నాయకులు జీఎల్ సుబ్బారావు, పి.రామయ్య, జి.వెంకటసుబ్బయ్య, పిచ్చయ్య పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు