
నిమ్మ ధర!
పాతాళంలోకి
హనుమంతునిపాడు:
నిమ్మకాయల ధరలు పాతాళంలోకి పడిపోవడంతో ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నష్టాలు తప్పేలా లేవంటూ ఆందోళన చెందుతున్నారు. కాయలు కోసి మార్కెట్‌కు తీసుకెళ్లినా.. వ్యాపారులు కొనుగోలు చేయమని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో తోటల్లోని చెట్లకే కాయలు వదిలేస్తున్నారు. అవన్నీ రాలిపోయి చెట్ల కింద పడుతున్నాయి. చెట్ల పాదుల్లో అలాగే వదిలేయడంతో ఆ కాయలన్నీ కుళ్లిపోయి ఆ వాసనకు నల్లి తెగులు వ్యాపిస్తోంది. ఈ తెగులు చెట్లకు సోకి ఏకంగా తోటలన్నీ తెగులు బారిన పడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కూలీల ఖర్చులకు, ఆటో బాడుగలకు సరిపడా ధరలు కూడా పలకకపోవడంతో కాయను కోయడం కంటే చెట్లకు వదిలేయడమే మేలనే రైతులు వదిలేస్తున్నారు.
కిలో రూ.2 నుంచి రూ.3 మాత్రమే...
నిమ్మ ధరలు నిలకడ లేకుండా రోజుకో ధర పలుకుతోంది. హనుమంతునిపాడు మండలం నిమ్మ సాగులో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. 2,874 హెక్టార్లకుపైగా సాగుచేస్తున్నారు. ముదురు, లేత తోటల సాగు సుమారు 2000 ఎకరాలపైబడి జరుగుతోంది. ఈ మండలం నుంచి ప్రతిరోజూ కనిగిరి మార్కెట్‌కు ఆటోలు, మినీ లారీల్లో నిమ్మ కాయలు తరలిస్తుంటారు. ఇటీవల ధర పూర్తిగా పడిపోవడంతో రైతులకు సమస్యలొచ్చిపడ్డాయి. ప్రస్తుతం నిమ్మకాయలు కిలో రూ.2 నుంచి రూ.3కు మించి పలకడం లేదు. కమిషన్ వ్యాపారులు ధర లేదని కాయను కొనుగోలు చేయడం లేదు. పచ్చి కాయ కిలో రూ.5 నుంచి రూ.6 మించి కొనుగోలు చేయడం లేదు. కోత కూలీలు, ఆటో బాడుగలు కూడా రావడం లేదు. ఈ ఏడాది మొదటి నుంచి నిమ్మకు ధర లేకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం నిమ్మ రైతుల గురించి పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లి తెగులుతో దెబ్బతింటున్న
నిమ్మ తోటలు...
నిమ్మకాయలను చెట్లకే వదిలేయడంతో అవన్నీ పండిపోయి రాలిపోతున్నాయి. పాదుల్లో కుళ్లిపోతున్నాయి. కుళ్లిన వాసనకు నల్లి తెగులు సోకి చెట్ల ఆకులు సైతం రాలిపోతున్నాయి. ఎండు పుల్లల తెగులు కూడా సోకుతోంది. వైరస్ సోకడంతో తోటలన్నీ పూర్తిగా దెబ్బతింటున్నాయి. దీంతో రాలిన కాయను ఏరి రోడ్ల పక్కన పోస్తూ రైతులు నలిగిపోతున్నారు.
పట్టించుకోని హార్టీకల్చర్ అధికారులు...
నిమ్మతోటల్లో నల్లి తెగులు, వైరస్ వ్యాపిస్తున్నప్పటికీ హార్టీకల్చర్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాటి నివారణ చర్యల గురించి రైతులకు కనీస సలహాలు, సూచనలు కూడా ఇవ్వకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నిమ్మతోటలకు వేరు కుళ్లు, ఎండుపుల్ల తెగులు, పేను బంక, కాయకు మంగు, మచ్చలు వచ్చి నాణ్యత కోల్పోతున్నాయి. మంగు, గజ్జి, మచ్చలున్న కాయను గ్రేడ్ చేసి పనికి రావంటూ రోడ్ల పక్కన పోస్తున్నారు.
తోటల్లో చెట్లకే వదిలేయడంతో రాలిపోతున్న నిమ్మకాయలు
ధర లేకనే వదిలేశామంటున్న రైతులు
కాయలు తీసుకొచ్చినా కొనుగోలు చేయమంటున్న వ్యాపారులు
పాదుల్లో వదిలేసిన కాయలు కుళ్లిపోయి సోకుతున్న నల్లి తెగులు
నల్లి తెగులుతో దెబ్బతింటున్న నిమ్మ తోటలు
పట్టించుకోని అధికారులు, పాలకులు
నష్టాలు తప్పడం లేదంటున్న నిమ్మ రైతులు
ఈ ఏడాది పూర్తిగా నష్టపోయాం
నిమ్మకాయకు ధర లేక కాయను కోయడం లేదు. కిలో రూ.2కు కూడా వ్యాపారుల అడగడం లేదు. కోత కూలీలకు వచ్చేలా కూడా ధరలు లేకపోవడంతో 5 ఎకరాల్లో సాగుచేస్తున్న నిమ్మ తోటల్లో కాయను కోయకుండా వదిలేశాను. ఈ ఏడాది పూర్తిగా నష్టపోయాం. నిమ్మ రైతు గురించి పట్టించుకునే నాథుడే లేడు.
– జె.దేవదానం, రైతు, సీతారాంపురం

నిమ్మ ధర!