
బనకచర్ల నిర్మిస్తారా?
రైతులను ఆదుకోలేని సీఎం
ఒంగోలు టౌన్: గిట్టుబాటు ధరలు రాక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలోని రైతులను ఆదుకోలేని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష కోట్ల రూపాయలతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి విమర్శించారు. స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శి పంట పొలాల్లో మీటింగ్ పెట్టి రైతుల బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.5 వేలు వేశారని, దీని వలన రైతుల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయో చెప్పాలని ప్రశ్నించారు. బర్లీ, వర్జీనియా పొగాకు కొనుగోలు చేసేందుకు రూ.1000 కోట్లు కేటాయించాలని రైతులు అడుగుతుంటే స్పందించని ముఖ్యమంత్రి మాయమాటలతో మభ్యపెట్టాలని ప్రయత్నిన్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలో అమరరాజా కంపెనీ జ్యూస్ కంపెనీ ఏర్పాటు చేయడంతో చిన్న, చితక ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, దీనివల్లనే మామిడికి ధరలు రాలేదని చెప్పారు. కనీసం కూలి కూడా దక్కని పరిస్థితుల్లో మామిడి రైతులకు రూ.100 కోట్లు కేటాయించాలని కోరినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెవికెక్కడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ రకాల పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు అల్లాడిపోతున్నారని చెప్పారు. రైతులు, సామాన్య ప్రజలు పెరిగిన ధరలతో అల్లాడి పోతుంటే ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగులగొట్టమని ప్రచారం చేసిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే స్మార్ట్ మీటర్లను బిగించడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.
విద్వేషాలను రెచ్చగొడుతున్న ఉప ముఖ్యమంత్రి ..
ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ చరిత్రను వక్రీకరిస్తూ సినిమాలు తీయడం ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని రమాదేవి ఆరోపించారు. మైనారిటీల మనోభావాలను దెబ్బతీయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. మహారాష్ట్ర, బీహారు ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండేలా ఓటర్ల ప్రత్యేక సవరణ నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లా సీపీఎం కార్యదర్శి ఎస్‌కే మాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా రూపొందించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. కార్యక్రమంలో సయ్యద్ హనీఫ్, చీకటి శ్రీనివాసరావు, కొండారెడ్డి, ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి