
పరిమళించిన మానవత్వం
గిద్దలూరు రూరల్: పట్టణానికి చెందిన గలిబిలి ప్రసాద్ అనే వ్యక్తి మద్యానికి బానిసై కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు. స్థానిక గ్రంథాలయం ఎదుట రోడ్డు మీద గత 5 రోజుల నుంచి పడిపోయి ఉన్నాడు. అక్కడే మలమూత్ర విసర్జన చేస్తూ దుర్భర స్థితిలో పడి ఉన్న అతని సమీపంలోకి వెళ్లేందుకు స్థానికులు సాహసం చేయలేదు. సమాచారం తెలుసుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బీఎస్ నారాయణరెడ్డి స్పందించి మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రసాద్‌కు క్షవరంతోపాటు స్నానం చేయించి నూతన వస్త్రాలు వేయించారు. అనంతరం ప్రసాద్‌ను కడప జిల్లా కాశినాయన మండలం ఓబులాపురం గ్రామంలోని వివేకానంద సేవాశ్రమానికి తరలించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డిని స్థానికులు అభినందించారు.