
5న పాలిటెక్నిక్ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు
ఒంగోలు సిటీ: ఒంగోలులోని డీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎన్.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఆటోమొబైల్, సివిల్, మెకానికల్ బ్రాంచిల్లో సీట్లు ఉన్నాయన్నారు. స్పాట్ అడ్మిషన్‌కు హాజరయ్యేందుకు దరఖాస్తులు కళాశాలలో ఇస్తున్నట్లు తెలిపారు. 4వ తేదీలోపు విద్యార్థులు తమ దరఖాస్తు ఈ కళాశాలలో అందజేయాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు విద్యార్థి పదో తరగతి మార్క్స్ మెమో, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, టీసీ, పాలిసెట్–2025 రాసిన విద్యార్థులు తమ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్‌ల నకళ్లు జతచేయాలన్నారు. 5వ తేదీ జరిగే కౌన్సిలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో హాజరు కావాలన్నారు.
కొండపి పంచాయతీకి ముగిసిన నామినేషన్లు
కొండపి: 14 సంవత్సరాల తర్వాత కొండపి పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంతో నామినేషన్‌లు వేయడానికి అభ్యర్థులు పోటీపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగిసిందని, సర్పంచ్ స్థానానికి 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి రవిబాబు తెలిపారు. 14 వార్డులకు 39 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. 1వ వార్డుకు నలుగురు అభ్యర్థులు, 2వ వార్డుకు ముగ్గురు, 4వ వార్డుకు ఇద్దరు, 5వ వార్డుకు ఇద్దరు, 6వ వార్డుకు ముగ్గురు, 7వ వార్డుకు నలుగురు, 8వ వార్డుకు ముగ్గురు, 9వ వార్డుకు ఇద్దరు, పదో వార్డుకు ముగ్గురు, 11 వ వార్డుకు ముగ్గురు, 12వ వార్డుకు ఇద్దరు, 13వ వార్డుకు ఇద్దరు, 14వ వార్డుకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. స్క్రూట్ని శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.
టీడీపీ నాయకుడితో కలిసి పింఛన్లు పంపిణీ
మార్కాపురం: పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రహసనంలా మారింది. సచివాలయ ఉద్యోగులు కూడా కూటమి నేతలు లేనిది ముందుకు వెళ్లడం లేదు. వారి మెప్పు కోసం చేస్తున్న పనులు విమర్శలకు తావిస్తున్నాయి. మార్కాపురం మండలంలోని పెద్దయాచవరం పంచాయతీ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు శుక్రవారం మొద్దులపల్లిలో పింఛన్లు పంపిణీ చేసేందుకు గ్రామ టీడీపీ నాయకుడిని వెంటపెట్టుకుని వెళ్లారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పింఛను డబ్బులను కూడా ఆ టీడీపీ నాయకునికి ఇచ్చి సదరు ఉద్యోగి బయోమెట్రిక్ వేసి పింఛన్లు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ విషయమై మార్కాపురం ఎంపీడీఓ శ్రీనివాసులును వివరణ కోరగా అతను పంచాయతీ వర్కర్ అని తెలిపారు.
సాగర్ కాలువను పరిశీలించిన ఇరిగేషన్ సీఈ
కురిచేడు: జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్), కమ్ చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) బి.శ్యాం ప్రసాద్ నాగార్జునసాగర్ కుడికాలువను శుక్రవారం పరిశీలించారు. కురిచేడు 126 వ మైలు వద్ద నుంచి 202.796 కి.మీ.వద్ద, దొనకొండ మండలం చందవరం 185.611 కి.మీ వద్ద కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. సాగర్ కాలువకు తాగు, సాగు నీరు విడుదల చేశారు. జిల్లా సరిహద్దు 85వ మైలు వద్ద 2550 క్యూసెక్కుల నీరు కుడికాలువకు వస్తోంది. 126వ మైలులో 1790 క్యూసెక్కుల నీరు దర్శి బ్రాంచి కాలువకు చేరుతోంది. ఒంగోలు బ్రాంచి కాలువకు నీరు శుక్రవారం రాత్రికి చేరుతుందని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో కురిచేడు ఎన్‌ఎస్పీ డీఈఈ అక్బర్ బాషా, కురిచేడు ఎన్‌ఎస్పీ ఏఈఈలు కె.సాంబశివరావు, బీ రవీందర్ రెడ్డి, కురిచేడు 32వ డిస్ట్రి బ్యూటరీ కమిటీ అధ్యక్షుడు ఉన్నగిరి కోటేశ్వరరావు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

5న పాలిటెక్నిక్ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు