జిల్లాకు రిక్త హస్తం చూపించిన బాబు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు రిక్త హస్తం చూపించిన బాబు

Aug 3 2025 2:56 AM | Updated on Aug 3 2025 2:56 AM

జిల్లాకు రిక్త హస్తం చూపించిన బాబు

జిల్లాకు రిక్త హస్తం చూపించిన బాబు

ఒంగోలు సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ప్రజలకు రిక్తహస్తం చూపించారని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ జిల్లాకు చంద్రబాబు వస్తుంటే పొగాకు రైతుల కోసం ఏదైనా ప్రకటన చేస్తారేమోనని ఆశగా చూశారని, తీరా సినిమా సెట్టింగ్‌ వేసుకుని వెళ్లిపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారన్నారు. జిల్లాలో పొగాకు రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొని ఉందని, వేలం కేంద్రాల్లో ధర రాకపోవడం, ఎక్కువగా తిరస్కరణ బేళ్లు ఉండటంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. వారిని ఆదుకోవడం మానేసి రైతులకు అన్నీ చేస్తున్నామని అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. సంక్షేమ పథకాలు అందించిన జగన్‌మోహన్‌రెడ్డిని జనం ఒక దైవంలా చూసుకుంటున్నారని, అది చూసి ఓర్వలేక ఆయనపై బురదజల్లే కార్యక్రమాలు చేయడం మంచిది కాదన్నారు. ఎన్నికలప్పుడు సూపర్‌ సిక్స్‌తో పాటుగా ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రసంగంలో దొనకొండ పారిశ్రామికవాడ ఊసే లేదన్నారు. డిగ్రీ కళాశాల ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. ఇసుక, మట్టి దోపిడీ, మద్యం, రేషన్‌ బియ్యం మాఫియాలు, తాజాగా చేపలు చెరువుల వద్ద నుంచి వసూలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మీరు సమావేశం పెట్టుకున్న పక్కనే ఒక రైతు ఇంటిపై మీ నియోజకవర్గ ఇన్‌చార్జి దౌర్జన్యానికి పాల్పడిందని, దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును ప్రశ్నించారు. పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులు పెడుతోందన్నారు. రైతులకు మేలుచేసిన రైతు భరోసా కేంద్రాలు తిరిగి పనిచేసేలా చూడాలని బూచేపల్లి డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ మేరుగు నాగార్జున మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమంలో లక్షలాది మంది లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా ముంచేశారన్నారు. ‘‘నాడు వ్యవసాయం దండుగ అన్నారు. నేడు రైతు పక్షపాతిగా ఉండే ప్రసక్తే లేదు’’ అని చంద్రబాబు అంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేశారన్నారన్నారు. వెలుగొండను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సంక్షేమశాఖ మంత్రి సొంత జిల్లా, చీమకుర్తి పట్టణంలో సంక్షేమ హాస్టల్‌లో ఉంటున్న బాలిక వెంట్రుకలను కోసేశారని, దీనికి మంత్రి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నేం శ్రీధర్‌బాబు, వైఎస్సార్‌ సీపీ నాయకులు బెజవాడ రాము, కోటిరెడ్డి, సుధాకర్‌, ఓబుల్‌రెడ్డి, అన్వేష్‌, చెంచిరెడ్డి, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement