
తిరోగమనం వైపు విద్యా వ్యవస్థ
రెండు ఓట్లు కలిగి ఉండటం నేరం
ఒంగోలు సబర్బన్: రెండు ఓట్లు కలిగి ఉండటం చట్ట ప్రకారం నేరమని ఒంగోలు ఆర్‌డీఓ లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఒంగోలు ఆర్‌డీఓ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలక్షన్ కమీషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్..31, ఆర్‌పీఏ–1950 ప్రకారం రెండు ఓట్లు కలిగిఉన్న వారిపై ఒక ఏడాది జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా విధిస్తారన్నారు. ఆర్‌డీఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెలా నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో రెండేసి ఓట్లు కలిగిన వారు వెంటనే ఒక ఓటును రద్దు చేసుకోవాలన్నారు. మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ మాత్రమే ఓటును కలిగి ఉండాలని తెలిపారు. రెండో ఓటును వెంటనే రద్దు చేసుకోకపోతే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నేరంగా పరిగణిస్తారన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. వెంటనే రెండో ఓటును తొలగించుకోవాలని ఒంగోలు నియోజకవర్గంలోని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారు ఆధార్ అనుసంధానం వెంటనే చేసుకోవాలని కోరారు. 18 ఏళ్లు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఒంగోలు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లలో 1200 ఓట్ల కంటే ఎక్కువ కలిగిన పోలింగ్ బూత్‌లోని ఓట్లను పక్కనే ఉన్న వేరే పోలింగ్ స్టేషన్‌కు మారుస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో లొకేషన్ చేంజ్ 12 పోలింగ్ బూతులు, కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు 12 వరకు పెరుగుతాయని మొత్తం పోలింగ్ స్టేషన్లు ఒంగోలు నియోజకవర్గంలో 271 ఏర్పడతాయని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా రెండేసి ఓట్లు కలిగిన ఓటర్లు దాదాపుగా 30 నుండి 35 వేల మంది ఉన్నారని ఇటువంటి ఓటర్ల వల్ల ఎన్నికల వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో అన్ని పొలిటికల్ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఒంగోలు కృష్ణ మోహన్, సుధాకర్, బాబురావు, రాంభూపాల్ రెడ్డి, పద్మజ, నాయుడు, శేషుబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: విద్యా వ్యవస్థను తిరోగమనం వైపు నెడుతున్న కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం హెచ్చరించింది. ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం స్థానిక ప్రకాశం భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఫ్యాప్టో చైర్మన్ కె.ఎర్రయ్య అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఉపాధ్యాయ, ఎంఈఓ, పెన్షనర్ల సంఘాల నేతలు పలువురు పాల్గొని మాట్లాడారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను పూర్తిస్థాయి విముక్తులను చేస్తామని, మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రి లోకేష్.. కనీసం ఉపాధ్యాయ సంఘ నేతలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ఎంఈఓల రాష్ట్ర సంఘ నేతలు తొలిసారిగా ధర్నాలో పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించగా, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎస్‌ఎండీ రఫీ ధర్నాను ప్రారంభించారు. ఎంఈఓల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కిషోర్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానివేసి వారికి పెట్టిన తిండి లెక్కలు తేల్చడానికి ఉపాధ్యాయులు సమయం వెచ్చించాల్సి రావడం విచారకరమన్నారు. ఎంఈఓ, హెచ్‌ఎం, డిప్యూటీ డీఈఓ ప్రమోషన్ల ప్రక్రియలో కామన్ సర్వీస్ రూల్స్ అమలుకు ఉన్న అడ్డంకులు తొలగించాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఉపాధ్యాయులచే ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈఓ, డైట్ కాలేజీ లెక్చరర్లు, ఎంఈఓల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసేలా ఉండటం విచారకరమన్నారు. ఉపాధ్యాయులను గిన్నిస్ బుక్ రికార్డు కోసం యోగాంధ్ర, మెగా పీటీఎం వంటి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు అమలు చేసే వారుగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 మంది విద్యార్థులున్న ప్రత్యేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు కాపలాదారుగా పనిచేయాల్సి రావడం విద్యా వ్యవస్థకే తీరని అవమానమని అన్నారు. బోధన వ్యవస్థకు ఆటంకం కలిగిస్తున్న యాప్‌లను పూర్తిగా రద్దు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని, తదితర 19 డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీటీఏ జిల్లా అధ్యక్షుడు పర్రె వెంకట్‌రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను తిరోగమనం వైపు నెడుతోందని దుయ్యబట్టారు. మరో పదేళ్లలో ప్రభుత్వ బడులు లేకుండా చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
ఉపాధ్యాయుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి...
ఎంఈఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్.నాగేంద్రవదన్ మాట్లాడుతూ సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు లేనిదే సమాజం లేదని, అటువంటి ఉపాధ్యాయుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని హితవు పలికారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ మంజుల మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం, మంత్రులు నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. హెచ్‌ఎంల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వై.వెంకటరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే అబ్దుల్ హై, బి.వెంగళరెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు పీవీ సుబ్బారావు మాట్లాడుతూ ఎంఈఓ–1 పోస్టుల భర్తీకి తీసుకున్న జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. జెడ్పీ, గవర్నమెంట్ మేనేజ్మెంట్లలో సంయుక్త సీనియారిటీ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు టీసీహెచ్ సుబ్బారావు, ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంచర్ల సుబ్బారావు పాల్గొని వారి సంఘాల తరఫున మద్దతు ప్రకటించారు. ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల నాయకులు డి.శ్రీనివాసులు (ఏపీటీఎఫ్–257), బి.వెంకట్రావు(ఏపీటీఎఫ్ 1938), చల్లా శ్రీనివాసులు, ఎస్.రవి, ఎన్.చిన్నస్వామి, వి.మాధవరావు, డి.జయరావు, జీఎండీ సనాఉల్లా, వి.జనార్దనరెడ్డి (ఏపీటీఎఫ్ 257), కె.శ్రీనివాసరావు, పరిటాల సుబ్బారావు, అట్లూరి అమ్మయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఒంగోలు ఆర్‌డీఓ లక్ష్మీ ప్రసన్న
కూటమి ప్రభుత్వ విధానాలే కారణం బోధనకు దూరమవుతున్న ఉపాధ్యాయులు ఫ్యాప్టో ధర్నాలో పలువురు ఉపాధ్యాయ సంఘ నేతల ఆందోళన తొలిసారి ఎంఈఓ అసోసియేషన్ సంఘీభావం

తిరోగమనం వైపు విద్యా వ్యవస్థ