
జగన్ పర్యటనను అడ్డుకుంటే శిక్ష తప్పదు
● వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి
మార్కాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటే ప్రజాకోర్టులో వారికి శిక్ష తప్పదని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హెచ్చరించారు. శనివారం మార్కాపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలిరాగా, అడ్డుకునేందుకు కూటమి సర్కారు చేసిన కుట్రలు అప్రజాస్వామికమని అన్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య అంటూ తీవ్రంగా ఖండించారు. ప్రజల్లోకి వెళ్లే స్వేచ్ఛ ప్రతి నాయకునికి ఉంటుందన్నారు. తమ అభిమాన నేత పర్యటనకు వెళ్లే పూర్తి అధికారం స్వేచ్ఛ ప్రజలకు కూడా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న కూటమి సర్కార్.. జగన్‌ను, ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. జగన్ పర్యటనను ఎంత అడ్డుకుంటే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అంత కోపం పెరుగుందని హెచ్చరించారు. దీని ఫలితం వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కార్ అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికై నా కూటమి సర్కార్ ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. కూటమి సర్కార్ తీరులో మార్పు రాకపోతే ప్రజలే ఆ ప్రభుత్వాన్ని మారుస్తారన్నారు. వైఎస్ జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ప్రజలకు ఏం చేశారని కూటమి సర్కార్ పెద్దలు హాస్యాస్పదంగా ప్రశ్నిస్తున్నారని, జగన్ ఏం చేశారో జనంలోకి వెళ్లి అడిగే దమ్ము ఈ ప్రభుత్వ పెద్దలకు ఉందా.? అని జంకె సవాల్ విసిరారు. తన పాలనలో మూడేళ్లు కరోనా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా మారినప్పటికీ పేదల సంక్షేమాన్ని వదలకుండా అనేక పథకాలను వైఎస్ జగన్ అమలు చేసిన విషయం ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు. ఈ విషయం కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు కూడా తెలుసన్నారు. ఈ విషయాన్ని గమనించిన కూటమి పెద్దలు.. జగన్ జనంలోకి వెళితే ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుస్తుందన్న భయంతో జగన్ పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని జంకె విమర్శించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వ పెద్దలు ఇటువంటి విధానాలను విడిచిపెట్టాలని ఆయన హితవు పలికారు.