
జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యం
చీమకుర్తి: టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా 2029లో ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ చీమకుర్తి మండల స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ 2029లో కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2.0 పరిపాలనలో పార్టీ నాయకులు, కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారంటూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తన సొంత జిల్లాను వదిలిపెట్టి సంతనూతలపాడు నియోజకవర్గానికి వచ్చిన మేరుగు నాగార్జునను వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు...
మేరుగు నాగార్జున మాట్లాడుతూ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలిలో నిర్వహించిన కార్యక్రమానికి 50 వేల మంది రైతులు హాజరైతే.. వారిపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టిందని, కానీ, ఇప్పుడు వచ్చి అన్నదాత సుఖీభవ అంటూ రైతుల పట్ల చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశాడు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ పథకాలతో పాటు 134 హామీలతో ప్రజలను మోసం చేసి చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనా కాలంలో ప్రజలకు పార్టీలకతీతంగా ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో, ఇప్పుడు చంద్రబాబు ఏడాది పాలనలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో తేల్చుకుందామని, బహిరంగ చర్చకు సిద్ధమా..? అని కూటమి నేతలకు సవాల్ విసిరారు. జగన్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గడప గడపకు అందిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఇప్పుడు చంద్రబాబు పథకాలేమీ అమలు చేయకుండానే సుపరిపాలనకు తొలి అడుగు అంటూ ప్రజల్లో వెళ్తే ప్రజలు మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పిలుపు మేరకు బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పేరుతో సంతనూతలపాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ సూపర్ సిక్స్, ఆడబిడ్డ నిధి పథకాలను ఎగ్గొట్టి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. సమావేశం అనంతరం బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం బూచేపల్లి శివప్రసాదరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, మేరుగు నాగార్జునను పార్టీ నాయకులు గజమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, పార్టీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల రూరల్ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, నాయకులు గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి, చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వెంకాయమ్మ, మేరుగు నాగార్జున
పొగాకు రైతులపై కేసులు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అంటున్నాడని ధ్వజం

జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యం

జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యం