బాబు ఫ్లాప్‌ షో | - | Sakshi
Sakshi News home page

బాబు ఫ్లాప్‌ షో

Aug 3 2025 2:56 AM | Updated on Aug 3 2025 2:56 AM

బాబు

బాబు ఫ్లాప్‌ షో

అన్నదాత సుఖీభవ డబ్బుల పంపిణీ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు సినిమా సెట్టింగ్‌ను తలపించేలా పంట పొలాల మధ్య..నులక మంచాలపై కూర్చొని మెడలో పచ్చ కండువాలు వేసుకున్న రైతుల మధ్య చేసిన కార్యక్రమం అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. మండుటెండతో రైతులు మధ్యలోనే జారుకోగా..టీడీపీ కార్యకర్తలతో సభను మమ అనిపించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఏ ఒక్క కొత్త హామీనీ ఇవ్వకుండా పాత హామీలనే వల్లెవేసిన బాబు తీరుపై అధికార పార్టీ కార్యకర్తల్లోనే అసంతృప్తి వ్యక్తమైంది.

దర్శి: బాబు వస్తారు..వరాల జల్లు కురిపిస్తారు అన్న ఆశతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి అన్నదాత సుఖీభవ మొదటి కార్యక్రమం దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని వినూత్న రీతిలో ఖర్చు లేకుండా పేరు సంపాదించేలా ఉండాలని దర్శి టీడీపీ ఇన్‌చార్జ్‌ గొట్టిపాటి లక్ష్మి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అధికారులు రెండు రోజులు భారీ ఎత్తున వచ్చి హడావిడి చేశారు. వచ్చే రైతులకు పాస్‌లు కూడా ఇచ్చి పంపారు. శనివారం ఉదయం 10 గంటలకు నాయకులు, కార్యకర్తలు వచ్చారు. వచ్చిన వారు అక్కడ చూసి ఖంగుతిన్నారు. అక్కడ అన్నీ నులక మంచాలే దర్శనం ఇచ్చాయి. ఒక్కటంటే ఒక్క కుర్చీ లేదు. టెంట్లు లేవు, ఎండకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు కూడా లేవు. పొలంలో ఎండలో కేవలం నులక మంచాలు మాత్రమే వేసి పెట్టారు. ఆ మంచాలపై టీడీపీ సానుభూతిపరులైన రైతులను కూర్చోబెట్టి ఆ ప్రోగ్రాం అయినా సక్సెస్‌ చేద్దామనుకున్న ప్రయత్నం విఫలమైంది.

మండుటెండలో మంచాలతో ప్రహసనం:

రైతులను ఆకుపచ్చ కండువాలు వేసి వారికి కేటాయించిన మంచాల పై కూర్చోబెట్టారు. అంత వరకు బాగానే ఉంది. పది గంటల నుంచి భానుడు భగ్గుమన్నాడు. ఆ ఎండకు మెడలో కండువాలు కాస్తా తలపైకి చేరాయి. ఎల్‌ఈడీ స్క్రీన్‌లో ప్రధాని మోదీ హిందీలో చెప్తున్న ప్రసంగాన్ని పెట్టడంతో జనానికి అర్థంకాక తలపట్టుకున్నారు. పైన టెంట్‌ లేకపోవడం, అక్కడ పూర్తి స్థాయిలో తాగునీరు లేకపోవడంతో వచ్చిన రైతులు, మహిళలు ఆ ఎండదెబ్బకు తట్టుకోలేక చల్లగా జారుకున్నారు. దీంతో మంచాలన్నీ ఖాళీ అయ్యాయి. ఆ తరువాత టీడీపీ అనుకూల రైతులకు పాస్‌లు ఇచ్చి పిలిచి కూర్చోబెట్టారు. వారు కూడా ఎండదెబ్బకు జారుకోవడం మొదలుపెట్టారు. దీంతో చంద్రబాబు వచ్చే సమయమైంది మంచాలు ఖాళీగా కనిపిస్తున్నాయని చెకింగ్‌ పాయింట్‌ తీసేసి కార్యకర్తలందరినీ వదిలేశారు. చంద్రబాబు, మంత్రులు, అధికారులు వచ్చి ఆయనతో పాటు మంచాల మీద కూర్చున్నారు. దీంతో వెనకున్న వారికి వచ్చిన వారు కనిపించలేదు. మంచాలపై కూర్చోకుండా నిలబడటం మొదలైంది. ఆ తరువాత ఒకరిని చూసి మరొకరు అందరూ మంచాలపై నుంచి లేచి నిలబడ్డారు. మంచాలు విరిగి తుక్కు తక్కు అయిపోయాయి. దీంతో మంచాల డ్రామా సెట్టింగ్‌ కాస్తా అట్టర్‌ ఫ్లాప్‌ అయింది.

ఒక్క హామీ ఇవ్వని వైనం

బాబు వస్తారు..వరాలు కురిపిస్తారు.. హామీలిస్తారని ఎదురుచూసిన కార్యకర్తలకు తీవ్ర నైరాశ్యం మిగిలింది. నియోజకవర్గానికి సంబంధించి ఒక్క హామీ ఇచ్చిన పాపాన పోలేదు. నియోజకవర్గంలో గత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో అదే హామీలను మళ్లీమళ్లీ కొత్తగా ఇస్తున్నట్టు వల్లెవేశారు.

జిల్లాలో రైతులకు రూ.122.74 కోట్లు:

అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 2,68,165 రైతులకు రూ.122.74 కోట్లు, దర్శి నియోజకవర్గంలోని 42,871 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.29.06 కోట్ల నగదును పంపిణీ చేశామంటూ రైతులైన సుబ్బరత్తమ్మ, పేరయ్యలకు చెక్కు రూపంలో నగదును సీఎం అందజేశారు. దర్శి మండలంలో 10,987 మంది రైతులకు రూ.7.69 కోట్లు, తూర్పు వీరాయపాలెంలో 476 మంది రైతులకు రూ.7.20 కోట్లు నగదు ఇచ్చామన్నారు. ఉదయం 11.30 గంటలకు రైతుల వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి దాదాపు రెండు గంటలపాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా, టీడీపీ దర్శి ఇన్‌చార్జ్‌ గొట్టిపాటి లక్ష్మి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.శ్రీనివాసులు ఉన్నారు.

నారపుశెట్టికి అవమానం

దర్శి నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కులా ఉన్న మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుకు, ఆయన సోదరుడు నగర పంచాయతీ చైర్మన్‌ నారపు శెట్టి పిచ్చయ్యకు చంద్రబాబు పర్యటనలో అవమానం ఎదురైంది. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావును చంద్రబాబు వాహనంలోకి ఎక్కనివ్వలేదు. అలాగే హెలిపాడ్‌ వద్ద పిచ్చయ్యను చంద్రబాబును కలిసేందుకు అవకాశం కల్పించలేదు. దీంతో నారపుశెట్టి పాపారావు అభిమానులకు విషయం తెలిసి భగ్గుమంటున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే ఉన్న పాపారావును సీఎం వాహనం ఎక్కనివ్వకపోవడం దర్శి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

సీఎం పాల్గొన్న కార్యక్రమం అట్టర్‌ ఫ్లాప్‌ అవడంపై కార్యకర్తల్లో అసంతృప్తి మంచాలతో డ్రామా సెట్టింగులు పల్లె వాతావరణం తీసుకురావాలనే ప్రయత్నం బెడిసికొట్టిన వైనం ఇదేం కార్యక్రమమంటూ ముక్కున వేలేసుకున్న రైతులు, టీడీపీ కార్యకర్తలు ప్రసంగంలో దర్శి అభివృద్ధి ఊసే ఎత్తని చంద్రబాబు

బాబు సభలో కార్యకర్తలు ఎక్కి తొక్కడంతో విరిగిపోయిన మంచాలు

బాబు ఫ్లాప్‌ షో1
1/1

బాబు ఫ్లాప్‌ షో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement