తూర్పుగోదావరి మైసూరు ఎడ్లు
సత్తా చాటిన
● ఆకట్టుకున్న రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పరుగు పోటీలు
స్వర్ణ(కారంచేడు): మండలంలోని స్వర్ణ గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మైసూర్ ఎడ్ల బండి పరుగు పందెం పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వల్లూరు నరేంద్రకుమార్‌కు చెందిన మైసూర్ ఎడ్లు ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. స్వర్ణమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా తిమిడెదపాడు డొంకలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 23 ఎడ్ల జతలు తమ పేర్లు నమోదు చేసుకోగా వర్షం కారణంగా కేవలం 18 ఎడ్ల జతలు మాత్రమే పాల్గొన్నాయి. ఎంపిక చేసిన రెండు కిలోమీటర్ల దూరాన్ని ఎడ్లు టైరు బండితో కలిసి పరుగెత్తాయి. మొదటి స్థానం పొందిన నరేంద్రకుమార్ ఎడ్ల జత 4 నిమిషాల 29 సెకన్ల, 69 మిల్లీ సెకన్ల సమయంలో గమ్యం చేరుకున్నాయి. తరువాత రెండో స్థానంను బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కఠారి వేణుబాబుకు చెందిన ఎడ్ల జత 4 నిమిషాల 36 సెకన్ల, 50 మిల్లీ సెకన్లలో, మూడో స్థానం.. భవనం క్రితిక్షరెడ్డికి చెందిన ఎడ్ల జత 4.37 నిమిషాల్లో, నాలుగో స్థానాన్ని ప్రకాశం జిల్లా అల్లూరుకు చెందిన జరుగుమల్లి మోహన్‌చంద్ ఎడ్ల జత 4.38 నిమిషాల వ్యవధిలో నిర్దిష్ట గమ్యం చేరుకున్నాయి. ప్రథమ బహుమతిని గ్రామానికి చెందిన శివరామకృష్ణప్రసాద్ రూ. 20000, రెండో బహుమతి రూ. 15000ను కట్టా బుజ్జి, నక్కా పిచ్చియ్య, కొమ్మాలపాటి వెంకటేశ్వర్లు అందించారు. మూడో బహుమతి రూ. 10000 నార్నె వాసు, చైతన్య పంపిణీ చేశారు. నాలుగో బహుమతి రూ. 5000ను భాను, రోహిత్‌సాయి అందించారు. న్యాయనిర్ణేతలుగా శివరామకృష్ణప్రసాద్, కట్టా ప్రసాద్, పూల గోపిలు వ్యవహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహక కమిటీ సభ్యులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.


