
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ‘దిశ’ యాప్‌ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. రాష్ట్రంలో అమ్మాయిల మీద దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. అమ్మాయిలపై జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో మహిళల రక్షణ కోసం వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్ జగన్ ‘దిశా’ యాప్ తెచ్చారు. దిశా యాప్‌ను కోటి యాభై లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఏ మహిళ, ఆడపిల్ల ఆపదలో ఉన్నా ఈ యాప్ ద్వారా రక్షణ పొందే అవకాశం కల్పించారు. క్షణాల్లోనే బాధితులను కాపాడిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దిశను నిర్వీర్యం చేశారు.
అమ్మాయిల మీద దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ప్రజల నుండి తీవ్ర విమర్శలు వచ్చేసరికి మళ్ళీ సురక్ష పేరుతో యాప్‌ను తీసుకువస్తున్నారు. ఇప్పటికే దిశా యాప్, పోలీసు స్టేషన్లు, వాహనాలు ఉన్నాయి. వాటిని సక్రమంగా వాడుకుని మహిళలను రక్షించండి. గతంలో ఈ యాప్‌ను తెచ్చినప్పుడు ఇప్పటి హోంమంత్రి అనిత పేపర్లను తగులబెట్టారు. ఇప్పుడు మళ్ళీ సురక్ష పేరుతో యాప్‌ని తెస్తున్నారు. జనసేన, టీడీపీకి చెందిన కొందరు నేతలు.. మహిళలపై అఘాయిత్యాలు పాల్పడ్డారు. వారిపై కేసులు కూడా ఉన్నాయి. అలాంటి వారిపై ఏం చర్యలు తీసుకున్నారు. ఇటువంటి కూటమి పాలనలో మహిళలకు ఇంకేం రక్షణ ఉంటుంది?’ అని ఘాటు విమర్శలు చేశారు.
