‘రేవంత్‌తో టీడీపీ ఎంపీల భేటీ ఆంతర్యం ఏమిటి?’ | YSRCP Leader Lella Appireddy Takes On Chandrababu | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌తో టీడీపీ ఎంపీల భేటీ ఆంతర్యం ఏమిటి?’

Apr 18 2026 5:17 PM | Updated on Apr 18 2026 6:09 PM

YSRCP Leader Lella Appireddy Takes On Chandrababu

తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంధాలు, అనుబంధాలు అందరికీ తెలిసినవే అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు పగలు బీజేపీతో.. సాయంత్రం కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. 

ఈ రోజు(శనివారం, ఏప్రిల్‌ 18వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. చంద్రబాబు తన రాజకీయాలతో తీవ్ర అప్రతిష్టను తెచ్చారని విమర్శించారు. టీడీపీ ఎంపీలు రేవంత్‌రెడ్డిని కలవడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌తో టీడీపీ ఎంపీలు కలవడానికి కారణం ఏంటని నిలదీశారు. 

చంద్రబాబుకు, రేవంత్‌కు ఉన్న లోపాయికారీ ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు.‘టీడీపీ మహిళా నేతలు కాంగ్రెస్ నేతలను ఎందుకు కలిశారు?, రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ ఎంపీలు ఎందుకు ఫోటోలు తీసుకున్నారు. బీజేపీ ఎంపీ వర్మ రేవంత్ కి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వటం ఏంటి? టీడీపీ నేతలు కూడా వెళ్లటం ఏంటి?, అసలు ఏం రాజకీయాలు చేస్తున్నారు?

మహిళా బిల్లుపై బాబు కుట్ర ఆధారాలతో బయటపెట్టిన MLC లేళ్ల అప్పిరెడ్డి

మీ లోపాయికారి ఒప్పందాలు ఏంటో బయట పెట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలకు ఎందుకు విఘాతం కలిగిస్తున్నారు?, చంద్రబాబు బీజేపీతో పొత్తులో ఉంటూ కాంగ్రెస్‌తో బంధాన్ని కొనసాగిస్తున్నారు. యువత, విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు?, అసలు వెన్నుపోటు రాజకీయాలు చేసేదే చంద్రబాబు’  అంటూ ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి కారకులను మహిళా లోకం కచ్చితంగా శిక్షిస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement