కేసీఆర్‌.. ఉద్యోగాలు ఇంకెప్పుడు?

YS Sharmila Comments Unemployment Hunger Strike In Mahabubabad - Sakshi

మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల

ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్‌ నాయక్‌ కుటుంబానికి పరామర్శ

సాక్షి, మహబూబాబాద్‌: రాష్ట్రంలో వందలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వోద్యోగం సాధించి వస్తామని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లి శవాలై ఇళ్లకు వస్తున్నారని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెందరు చనిపోతే సీఎం కేసీఆర్‌ దాహం తీరుతందని, ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇంకెప్పుడు వేస్తారని నిలదీశారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల డిమాండ్‌తో ప్రతి మంగళవారం వైఎస్‌ఆర్‌టీపీ నిర్వహిస్తున్న నిరాహార దీక్ష మంగళవారం మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం గుండెంగి గ్రామంలో జరిగింది.

ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఐదు నెలల క్రితం కాకతీయ వర్సిటీలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్‌ నాయక్‌ కుటుం బాన్ని షర్మిల పరామర్శించారు. గుండెంగి సమీపంలోని సోమ్లా తండాలో ఉన్న సునీల్‌ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు మల్లిక, రాందన్, అన్న శ్రీనివాస్, వదిన వనజలతో మాట్లాడారు. వారిని ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం గుండెంగలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 6 గంటలకు సునీల్‌ తల్లిదండ్రులు నిమ్మరసం ఇచ్చి షర్మిల దీక్షను విరమింపజేశారు.

వారి ఆత్మహత్యలకు కేసీఆరే కారణం... 
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉద్యమ నాయకుడికి ఓటు వేసినా ఉద్యోగాల నోటిఫికేషన్‌ వేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారి ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని షర్మిల ఆరోపించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top