ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తా: వైఎస్‌ షర్మిల

YS Sharmila Comments After Release From Chanchalguda Jail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో అరెస్ట్‌ అయిన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో  చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తానని పేర్కొన్నారు.ఎందుకు అకారణంగా తనను రోజుల తరబడి హౌజ్‌ అరెస్ట్‌ చేశారని ప్రశ్నించారు. బోనులో పెట్టినా పులి..పులే.. నేను రాజశేఖర్‌రెడ్డి బిడ్డనని వ్యాఖ్యానించారు. 

కేసీఆర్‌ అరాచకాలు ఇంక ఎంతకాలం సహించాలని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పోలీసులు బెదిరించారని.. తన ఆత్మరక్షణ కోసమే మగ పోలీసులను నెట్టివేసినట్లు పేర్కొన్నారు. ఎవరిమీద చేయి చేసుకోలేదని అన్నారు. పోలీసులు ఏ అధికారం ఉందని తనను హౌస్‌ అరెస్ట్‌ చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సిట్‌ ఆఫీస్‌కు సామాన్యుడికి పోయే పరిస్థితి లేదా? అని నిలదీశారు. ఇక్కడున్నది రాజశేఖర్‌రెడ్డి బిడ్డ.. భయపడటం తెలీదన్నారు.

‘రాజశేఖర్‌ రెడ్డి బిడ్డ అంటే కేసీఆర్‌ భయపడుతున్నారు. అందుకే నా మీద ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. 9 ఏళ్లలో కేసీఆర్‌ ఏం సాధించారు. కేసీఆర్‌కు పరిపాలన చేతనైందా. అవినీతి చేయడం చేతనైంది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కేసీఆర్‌కు చేతనైంది. కేసీఆర్‌ ఎప్పుడైనా సెక్రటేరియట్‌కు వెళ్లారా? కేసీఆర్‌ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కొడుకు రియల్‌ ఎస్టేట్‌, కుమార్తె లిక్కర్‌స్కాం, చేయడం సాధ్యమైంది. వేలకోట్ల అవినీతి సొమ్ము సంపాదించడమే తెలిసింది.

తాలిబన్లలాగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. ఇది అప్ఘనిస్తాన్‌ అనకపోతే ఏమనాలి. వైఎస్సార్‌టీపీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీసులకు తెలియదా? పోలీసులు నాపై పడి దాడి చేసే ప్రయత్నం చేశారు. మహిళ అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారు. నాపై మళ్లీ దాడి చేస్తారనే ఉద్ధేశంతోనే పోలీసులను తోసేశాను. పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నన్ను చూడటానికి అమ్మ వస్తే అది తప్పా? అమ్మతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.’ అని షర్మిల పేర్కొన్నారు.
చదవండి: తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. చదువుకుంటూనే సంపాదన! 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top