సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో ఎన్నో అక్రమాలు జరిగాయని.. ఆ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలే. వెన్నుపోటు, మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే. మెగా డీఎస్సీ పేరుతో పెద్ద స్కామ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పేరుతో డ్రామాలు చేశారు. ఇది కూడా పెద్దమోసమే. లక్షల మంది నమ్మకాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ వమ్ము చేశారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు.
ఇంత ఘోరంగా రిక్రూట్‌మెంట్ ఏపీ చరిత్రలోనే జరగలేదు. వాస్తవంగా మా హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషం ఇచ్చాం. వాటిని భర్తీ చేయకుండా రిక్రూట్‌మెంట్ ఆలస్యం చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదీ చంద్రబాబుగారి మొదటి సంతకం పరిస్థితి.
మెగా డీఎస్సీ అని చంద్రబాబు ఒకటే డబ్బా కొట్టుకున్నారు. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? అసలు రికార్డు ఏంటో ఇప్పుడు చెప్తా అంటూ వైఎస్ జగన్ అసలు రికార్డు చెప్పుకొచ్చారు.. 👇
👉16 వేల పోస్టులకే ఇన్ని స్కామ్‌లు, లీకులు కనిపిస్తున్నాయి. మెగా డీఎస్సీలో మెగా అంటే ఏంటో అర్థం కావడం లేదు. అసలు దీనిని అలా పిలవడానికి అర్హతే లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో లక్షల మంది ఉద్యోగ పరీక్షలు రాస్తే.. ఒక్క తప్పు జరగలేదని జగన్ గుర్తు చేశారు.
👉రాష్ట్ర చరిత్రలో కాని, దేశ చరిత్రలో కాని ఎప్పుడూ లేని రీతిలో ఒకే ఏడాది, ఒకే నోటిఫికేషన్‌తో, ఒకే టైంలో 1లక్షా 3౦వేల ఉద్యోగాల భర్తీ జరిగిందీ అంటే.. అది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే. అదీ రికార్డు అంటే. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు మేం వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు.
👉మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, ఆ తర్వాతి యాభై రోజుల్లోనే అంటే జులై 19న జీవో ఇచ్చాం. జులై 25 - 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చాం. జులై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8వరకూ పరీక్షలు నిర్వహించాం.
👉మొత్తం 2,800 సెంటర్లలో 19లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.౩ లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తిచేశాం. అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం.

కానీ, మెగా డీఎస్సీ పేరుతో మీరు నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు? మీరు చేసిన గోల్‌మాల్ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారు? ఎంతమంది రోదిస్తున్నారు? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు.


