సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్‌లు కలిసి ఓ మెగా స్కామ్‌కు రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ ఎక్స్‌లో ఇలా ట్వీట్ చేశారు.. ఏపీలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వేర్వేరు విభాగాల నుంచి తొలగించి, SCERT డైరెక్టర్‌కు కేంద్రీకరించడం ద్వారా ఒకే చోట అధికారం కేంద్రీకృతమైంది. దీని వల్ల అక్రమాలకు దారి తీసింది.
అలాగే, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడ్ పనులను ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం తీవ్రమైన లోపమని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం “పేపర్ లీక్‌కు స్పష్టమైన సంకేతం” అని ఆయన ప్రస్తావించారు. ఆ వ్యక్తికి తరువాత ఉద్యోగం ఇవ్వకపోవడం, అతని వివరాలను మెరిట్ లిస్టు నుంచి తొలగించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.
మరోవైపు ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లేకపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులు ప్రదర్శించకుండా, కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే ప్రకటించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుది జాబితాలో పేర్లు లేకపోవడం “వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.

క్రీడా కోటా నియామకాల విషయంలో కూడా పెద్ద మార్పులు చేసి, పరీక్ష రాయకుండానే నియామకాలు జరిపేలా విధానాలను మార్చారని, తరువాత ఆ విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా “బ్యాక్‌డోర్ ఎంట్రీకి దారి తీసిన విధాన ప్రయోగం” జరిగిందని జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. టీచర్ పోస్టు కోసం జరిగిన బేరసారాల వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై కేవలం టోకెన్ కేసు నమోదు చేసి, సరైన దర్యాప్తు జరిపించలేదని జగన్ పేర్కొన్నారు.
ఈ మొత్తం డీఎస్సీ ప్రక్రియను “దశలవారీగా జరిగిన బడా స్కామ్”గా అభివర్ణించిన వైఎస్ జగన్.. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకతను కోల్పోయిందని అన్నారు. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలికితీయడానికి స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ విచారణ తప్పనిసరి అని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ అంశాల్నే ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.
The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears… pic.twitter.com/8yZ6jvhPwb
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2026


