AP: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా? | Will Tdp Alliance With Congress In Ap | Sakshi
Sakshi News home page

AP: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా?

Published Sat, Dec 9 2023 4:56 PM | Last Updated on Sat, Dec 9 2023 6:22 PM

Will Tdp Alliance With Congress In Ap - Sakshi

వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందా?. తెలంగాణలో తమకు వ్యతిరేకంగా టీడీపీ పనిచేసిందని కమలనాథులు ఫీలవుతున్నారా? తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో టీడీపీ సంబరాలు చేసుకుంది. ఇది గమనించే.. త్వరలోనే ఇండియా కూటమిలో టీడీపీ చేరబోతోందంటూ బీజేపీ నేతలు కామెంట్స్‌ చేస్తున్నారు. ఏపీలో తమ పొత్తు జనసేనతోనే అంటున్నారు.. మరి టీడీపీ ఏం చేస్తుంది?

ఒక పక్క ఏపీలో బీజేపీతో పొత్తు ఉండే బాగుండును అని చంద్రబాబు తహతహ లాడుతున్నారు. తన రాజకీయ శిష్యుడు పవన్ కళ్యాణ్ పార్టీకి బీజేపీతో జట్టు కట్టించి.. టీడీపీతో కూడా పొత్తుకు ఒప్పించడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తోన్నా.. చంద్రబాబు నాయుడి వైఖరి తెలియడంతో బీజేపీ అగ్ర నాయకత్వం టీడీపీని దూరం పెడుతోంది. ఒక్క జనసేనతోనే తమ పొత్తు ఉంటుందని బీజేపీ కేంద్ర మంత్రులు పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం బీజేపీకి దగ్గర అవ్వడానికి.. నరేంద్ర మోదీ దృష్టిలో పడ్డానికి రక రకాల విన్యాసాలు చేస్తూనే వస్తున్నారు.

తెలంగాణా ఎన్నికల్లో దుమ్మురేపి టీడీపీ సత్తా ఏంటో అందరికీ చాటి చెబుదాం అని చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలయ్య ఎన్నికల నగారా మోగిన కొత్తలో హైదరాబాద్ లో కూర్చుని  భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఆ వెంటనే తెలంగాణాలో మొత్తం 119 నియోజక వర్గాల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని మొదటి జాబితాలో 87 మంది అభ్యర్ధుల పేర్లు ప్రతిపాదించారని.. వాటిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు పంపుతామని తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అప్పట్లో ప్రకటించారు. దాన్ని టీడీపీ అనుకూల మీడియా  హైలెట్ చేసింది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో.. ఎవరితో ఏ డీల్ కుదిరిందో తెలీదు కానీ చంద్రబాబు అర్జంట్‌గా కాసానిజ్ఞానేశ్వర్‌ని జైలుకు పిలిపించుకుని మనం తెలంగాణాలో పోటీ చేయడం లేదని చంద్రబాబు తెగేసి చెప్పారు. దాంతో కాసానితో పాటు తెలంగాణా టీడీపీ నేతలు విస్తుపోయారు.

ఎవరికి మేలు చేయడానికి చంద్రబాబు నాయుడు ఎన్నికల బరి నుండి తప్పుకున్నారో తెలీదుకానీ రెండేళ్లుగా తెలంగాణా లో పార్టీ బలోపేతానికి తమ జేబుల్లోంచి పెద్ద మొత్తంలో నిధులు తీసి ఖర్చుపెట్టిన టీడీపీ నేతలు మాత్రం ఒక్కసారిగా దివాళా తీశారు. వాళ్ల కష్టం బూడిలో పోసిన పన్నీరైంది. ఇది సహించలేకనే కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ  అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పి బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఇక తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. టీడీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు కానీ.. టీడీపీ వ్యూహకర్తలు మాత్రం బీఆర్‌ఎస్‌ను ఓడించడమే తమ లక్ష్యమని చెప్పుకు తిరిగారు. చంద్రబాబు అరెస్ట్‌ను బీఆర్‌ఎస్‌ నేతలు ఖండించకపోవడంతో కోపంగా ఉన్న టీడీపీ నేతలు అభిమానులు సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపు నిచ్చారు. 

అయితే సీమాంధ్ర ఓటర్ల ప్రాబల్యం ఉన్న ప్రతీ చోటా బీఆర్‌ఎస్‌ గెలిచింది. కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవలేదు. కాంగ్రెస్ తెలంగాణా గ్రామీణ నియోజకవర్గాల్లో ఘన విజయాలు సాధించి అధికారంలోకి వచ్చింది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజక వర్గాల్లో బోణీ కూడా కొట్టలేదు. అంటే టీడీపీ ప్రభావం నిల్. అయినా  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గాంధీభవన్ లోనూ రేవంత్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా  టీడీపీ జెండాలతో  హడావుడి చేసి ఆ విజయంలో తమకూ వాటా ఉందని చాటుకునే ప్రయత్నం చేశారు. తాము చెప్పినట్లు ఓటర్లు నడుచుకోలేదని తెలిసినా టీడీపీ నేతలు మోసానికి పాల్పడ్డారు.

కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి టీడీపీ ఆవిర్భవించింది. అటువంటి  కాంగ్రెస్ విజయాన్ని టీడీపీ సెలబ్రేట్ చేసుకోవడం చూసి కాంగ్రెస్ నేతలే  ఆశ్చర్యపోతున్నారు.  ఏపీలో బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తూ తెలంగాణాలో కాంగ్రెస్ విజయాన్ని ఆనందిస్తోన్న టీడీపీని చూసి చంద్రబాబుకు రెండు కళ్ల సిద్ధాంతం జబ్బు ఇంకా తగ్గలేదా అని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ వైఖరిని చూసి బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుందని మీడియా ప్రశ్నిస్తే ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి  సీరియస్ అయ్యారు. ఏపీలో కాంగ్రెస్ టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయేమో అని ఆయన అన్నారు.

కాంగ్రెస్-టీడీపీల పొత్తులో ఆశ్చర్యపోడానికి ఏమీ లేదు. 2018 లో తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్‌లు జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగాయి. అవకాశ వాద పొత్తును అసహ్యించుకున్న తెలంగాణా ప్రజలు ఇద్దరినీ తిరస్కరించి బీఆర్‌ఎస్‌కు తిరుగులేని విజయం కట్టబెట్టారు. ఆ తర్వాత 2019లో ఏపీ ఎన్నికల్లో నలుగురు కాంగ్రెస్ సీనియర్లకు టీడీపీ తరపున లోక్ సభ టికెట్లు ఇచ్చి ఎన్నికల బరిలో దింపారు చంద్రబాబు. అలా పరోక్షంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఏపీ ప్రజలు కూడా ఈ అవకాశ వాద పొత్తును ఏవగించుకుని ఘోర పరాజయాలు కట్టబెట్టి పంపారు. ఇపుడు మరోసారి ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ప్రజలే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని రాజకీయ పండితులు అంటున్నారు.
ఇదీ చదవండి: పవన్‌.. చంద్రబాబు, లోకేష్‌ ఆ మాట చెప్పగలరా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement