ముగిసిన బెంగాల్‌ పోలింగ్‌

West Bengal Election 2021: Over 76 per cent voter turnout recorded - Sakshi

తుది దశలో 76.07% ఓటింగ్‌

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ తుది దశ పోలింగ్‌లోనూ భారీగా పోలింగ్‌ నమోదైంది. గురువారం 35 స్థానాలకు జరిగిన ఎనిమిదో విడత పోలింగ్‌లో 76.07శాతం పోలింగ్‌ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కరోనా భయాలను కూడా ఖాతరు చేయకుండా పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ దశలోనూ పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీర్భమ్‌ జిల్లా ఇలామ్‌బజార్‌ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి. బీజేపీ అ«భ్యర్థి అనిర్బన్‌ గంగూలీపై దాడి జరిగినట్టుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు.

కర్రలు, బ్యాట్‌లు తీసుకొని ఆయనపై దాడి చేయడానికి వచ్చినçప్పుడు ఏర్పడిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. ఈ దాడి వెనుక టీఎంసీ మద్దతుదారులు ఉన్నారని గంగూలీ చెప్పారు. తన కారుని పూర్తిగా ధ్వంసం చేశారని అన్నారు. వాళ్లు రాక ముందు వరకు పోలింగ్‌ ప్రశాంతంగా సాగిందని తెలిపారు. జొరసాంకో నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మీనాదేవి పురోహిత్‌ తాను నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటే ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు తన కారుపై బాంబులు విసిరారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలు ఉండగా ఎనిమిది దశల్లో పోలింగ్‌ నిర్వహించారు. మార్చి 27 న మొదలైన పోలింగ్‌ ఏప్రిల్‌ 29తో ముగిసింది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top