చారాణ కోడికి.. బారాణా మసాలా!. కానీ, ఏపీలో ఏ కోడి కోయకుండానే చంద్రబాబు సర్కార్ మసాలా నూరుతోంది. లేని అభివృద్ధిని ఉన్నట్లుగా చూపించేందుకు డిజిటల్ ప్రమోషన్ల పేరిట కోట్లు కుమ్మరిస్తోంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రంలో యువ ఐటీ మంత్రి.. అందునా ఫస్ట్ టైం మహిళా ఎమ్మెల్యే.. అతితక్కువ ఖర్చుతో పెట్టుబడుల్ని ఆకర్షించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తేడా సహజంగానే రాజకీయ వర్గాల్లో పెద్ద డిబేట్‌కు దారితీసింది..
విజయ్ కేబినెట్‌లో పరిశ్రమల మంత్రిగా ఉన్న ఎస్. కీర్తన ప్రస్తుతం సోషల్ మీడియా స్టైల్ పాలనతో హాట్ టాపిక్‌గా మారారు. మొన్నటి ఎన్నికల్లో శివకాశిలో నెగ్గిన ఆమె.. కొన్నిచోట్ల తెలుగులో ప్రచారం చేసి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు పాలనలోనూ అదే జెన్‌జీ మార్క్ చూపిస్తూ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలకు నేరుగా డిజిటల్‌గా రిక్వెస్టులు పంపడం, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్ వాడటం వంటివి తమిళనాడులో కొత్త చర్చకు దారి తీశాయి.
దీంతో సహజంగానే కొంతమంది కంపెనీల దృష్టి తమిళనాడు వైపు మళ్లుతోందన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కీర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ “రీల్స్ మంత్రిగా పాలన సాగుతోంది” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై ఆమె మాత్రం “అంత తొందరెందుకు?.. వెయిట్ అండ్ సీ ఫర్ రిజల్ట్” అంటూ స్పందిస్తూ తన దారి తాను కొనసాగిస్తున్నారు.

ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అక్కడి రాజకీయాల్లో వేలు పెట్టడం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం వివాదానికి మరింత వేడి పెంచాయి. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని కీర్తనకు ఇచ్చిన సూచన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఒకవైపు ఇది సాధారణ సలహాగా కనిపించినా.. మరోవైపు ఈ వ్యాఖ్యల తర్వాత తమిళనాడులో ప్రతిపక్షాలు ఆ అంశాన్ని పట్టుకుని కీర్తనపై విమర్శలు మరింత తీవ్రతరం చేసినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో కోణం కూడా చర్చలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా మారకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్‌గా పలు రాష్ట్రాల ఎన్నికలకు పని చేసిన అనుభవం ఉంది. ఇందులో భాగంగా టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని వినికిడి. విశేషం ఏంటంటే.. ఆ సమయంలోనే ఆమె తెలుగు నేర్చుకోవడంతో పాటు డిజిటల్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్‌లపై మంచి పట్టు సాధించారట. అయితే వేగంగా పెంచుకుంటున్న డిజిటల్ ఇమేజ్, యువతలో కీర్తనకు లభిస్తున్న ఫాలోయింగ్ వంటి అంశాలు కొందరు రాజకీయ వర్గాల్లో కంటగింపుగా మారుతున్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యమే లోకేష్ ఎంట్రీకి కారణమైందని చర్చ నడుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో కీర్తన చేస్తున్న కొత్త తరహా ప్రయోగాలు.. ఏపీలోని సంప్రదాయ ప్రమోషన్ మోడల్‌ను ప్రశ్నిస్తున్నాయన్న భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంతోనే ‘మీ రాష్ట్రం సంగతి మీరు చూస్కోవచ్చు కదా!’ అంటూ కొందరు తమిళులు లోకేశ్‌ను నిలదీస్తున్నారు.
సోషల్ మీడియాలో రీల్స్, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్‌తో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒకవైపు కీర్తన ప్రయత్నం చేస్తుంటే.. ప్రజాధనాన్ని అభివృద్ధి కంటే ఇమేజ్ బిల్డింగ్‌కు అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం. కీర్తన నేపథ్యానికి తోడు.. వాడుతున్న డిజిటల్ కమ్యూనికేషన్ స్టైల్, యువతలో ఆమెకు పెరుగుతున్న ఫాలోయింగ్ కూడా లోకేష్ వర్గానికి అసౌకర్యంగా మారిందన్న చర్చ ఉంది. దీంతో ఈ మొత్తం వ్యవహారం పాలసీ డిబేట్ కంటే వ్యక్తిగత రాజకీయ ఈర్ష్యగా మారిందన్న వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. వెరసి ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు ‘జెలసీ పాలిటిక్స్’ చర్చగా మారింది.


