బెంగాల్ దంగల్‌:‌ మోదీ–దీదీ మాటల యుద్ధం

War of Words In PM Narendra Modi and Bengal CM Mamata Banerjee - Sakshi

మమత మేనల్లుడు సింగిల్‌ విండో

బీజేపీ ప్రపంచంలోనే దోపిడీ పార్టీ  

ఖరగ్‌పూర్‌/ హల్దియా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మధ్య మాటల తూటాలు పేలాయి. మమత సర్కార్‌ దోపిడి విధానాలను మోదీ ఎత్తి చూపిస్తే, బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడి పార్టీ అంటూ దీదీ ఎదురు దాడి చేశారు. శనివారం ఖరగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీకి భారీగా తరలివచ్చిన జన సమూహాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

మమత సర్కార్‌ దోపిడి విధానాల వల్ల రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, కేవలం మాఫియా ఇండస్ట్రీ మాత్రమే పని చేస్తోందని ధ్వజమెత్తారు. మమత మేనల్లుడు, డైమండ్‌ హార్బర్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీని సింగిల్‌ విండోగా అభివర్ణించారు. ఆయనతో మాట్లాడకపోతే ఒక్క పని జరగడం లేదని పారిశ్రామికవేత్తలందరూ హడలెత్తిపోతున్నారని అన్నారు. ‘‘పారిశ్రామికీకరణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగిల్‌ విండో విధానాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు దీనిని పాటిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. బెంగాల్‌లో కూడా సింగిల్‌ విండో ఉంది. మమత మేనల్లుడే ఇక్కడ సింగిల్‌ విండో. ఆ విండోని దాటకుండా ఒక్క పని కూడా జరగదు’’అని ఆరోపించారు.

అన్నీ అమ్మేస్తున్నారు  
హల్దియా రేవు పట్టణంలో జరిగి ఎన్నికల సభకి వీల్‌ చైర్‌లోనే హాజరైన సీఎం మమతా బెనర్జీ మోదీ మాటల్ని తిప్పి కొట్టారు. ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద దోపిడీ పార్టీ అని ఆరోపణలు గుప్పించారు. పీఎం కేర్స్‌ఫండ్‌ ద్వారా ఆ పార్టీ ఎంత డబ్బు సంపాదించిందో ఒక్క సారి చూడండని అన్నారు. మోదీని మించిన అమ్మకం దారుడు మరెవరూ లేరని ధ్వజమెత్తారు. ప్రధాని అన్నీ అమ్మేస్తూ భారత ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ౖ‘‘రెల్వేలను ప్రైవేటు పరం చేశారు. బొగ్గు, బీఎన్‌ఎన్‌ఎల్, బీమా, బ్యాంకులు ఇలా అన్నీ అమ్మేస్తున్నారు’’అంటూ విమర్శించారు. ఏదో ఒక రోజు హల్దియా ఓడరేవుని కూడా అమ్మకానికి పెట్టేస్తారని హెచ్చరించారు.. బెంగాల్‌ని కాపాడుకోవాలంటే తృణమూల్‌ కాంగ్రెస్‌కే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసిన మమత అప్పుడే రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top