
సాక్షి, హైదరాబాద్: యూరియా కొరతపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. కొరతకు కారణం కేంద్రమో, రాష్ట్రమో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. రైతుల కష్టాలపై చర్చించడానికి ప్రభుత్వానికి భయమెందుకు? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.
‘‘వరద నష్టంపై చర్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎప్పటిలోగా ఎరువులు అందిస్తారో ప్రభుత్వం చెప్పాలి. రైతుల కష్టాలు వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదా?. రైతుల ఇబ్బందులపై సీఎం సమీక్ష కూడా చేయరా?. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. అప్పటివరకు అసెంబ్లీని స్తంభింపజేస్తాం’’ అని హరీష్‌రావు హెచ్చరించారు.
మరో వైపు, బీఆర్‌ఎస్ యూరియా కార్యక్రమం పట నాటకమంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. యూరియా కొరతకు కారణం.. రాష్ట్ర ప్రభుత్వమా? లేక కేంద్ర ప్రభుత్వమా మీకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం పరిధిలో విషయమని పదేళ్ల మీ పాలనలో మీకు తెలియదా?. రైతుల ముసుగులో మీ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలు హర్షిస్తారా?. అధికారం లేదనే అక్కసుతో రేవంత్ ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దిగజారుడు రాజకీయం ఎవరి కోసం?’ అంటూ తుమ్మల దుయ్బయట్టారు.
‘‘జియో పాలిటిక్స్ వల్ల, దేశీయ ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గట్టు లేక యూరియా కొరత ఉంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు?. యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు?. రేవంత్‌రెడ్డి పాలనలో మూడు పంట కాలాల్లో యూరియా కొరత లేనీ విషయం మీకు తెలియదా?. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత ఉంటే సీఎం రేవంత్‌పై మీ శాపనార్థాలు ఏమిటి?. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తేనే తెలంగాణకు యూరియా పంపిణీ చేస్తున్నారు. రైతాంగం ప్రయోజనాల కంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసే నాటకాలు రైతులు నమ్మే స్థితిలో లేరు’’ అంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.