
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో రాజకీయ కక్ష సాధింపునకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కమీషన్ల పేరుతో పాలన నడుస్తోందన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్టు ముందు నిలబడవు, ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ పెడితే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చీల్చి చెండాడుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణభవన్‌లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది. విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ రాక ఇంట్లోనే ఉంటున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. కమీషన్ల పేరుతో పాలన నడుస్తుంది. రాష్ట్రం మొత్తం కమీషన్ల మయం చేశారు. రెండు పార్టీలు రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నాయి. NDSA రిపోర్ట్ గురించి అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టు రెండు సార్లు కూలిపోతే NDSA లేదు. మేడిగడ్డ బ్యారజ్‌లో రెండు పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద NDSA రిపోర్ట్ వచ్చింది.
కాళేశ్వరం కమిషన్ గడువు రాత్రికి రాత్రే పెంచారు. కేసీఆర్‌కు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని మీడియాకే ముందు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ పూర్తి రిపోర్ట్ వస్తే బీఆర్ఎస్ ఎలా స్పందించాలో మాకు తెలుసు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చ పెడితే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చీల్చి చెండాడుతుంది. ప్రభుత్వం బయటపెట్టిన రిపోర్టు చూస్తుంటే పూర్తిగా ఆధారాల్లేవు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్టు ముందు నిలబడవు, ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది.
టీవీల్లో వచ్చే సీరియల్‌లా రోజుకో అంశంపైన రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి. కన్నేపల్లి పంపు హౌస్ ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా.. నీళ్లను ఇవ్వడం లేదు. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు పని కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ గో బెల్స్ ప్రచారం చేస్తుంది. బేగంపేట ఎయిర్ పోర్టులో కేసీఆర్ సవాల్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించలేక పారిపోయాడు. తుమ్మడిహట్టి 152 మీటర్ల ఎత్తుకు ప్రాజెక్టు కట్టేందుకు అనుమతి ఉన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశాడు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
