
హైదరాబాద్, సాక్షి: ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. రెండు రోజులే అసెంబ్లీ నిర్వహించి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. శనివారం బీఏసీ సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చిన ఆయన.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
శాసన సభలో వరదల పై చర్చించాలని కోరాం. ఫీజ్ రీయింబర్స్మెంటుపై మాట్లాడాలని కోరాం. యూరియా కొరత పై మాట్లాడాలి కోరాం. ప్రభుత్వ ఉద్యోగుల టీఏ, డీఏపై మాట్లాడాలనీ కోరాం. ప్రజా సమస్యలు మాట్లాడకుండా రెండు రోజులే సభ నిర్వహిస్తామని చెబుతున్నారు. మేం 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని కోరాం. వరదపై మాట్లాడకుండా బురద రాజకీయం చేయాలని చూస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా ఎరువులపై చర్చించాలని ఇవాళ సభ నుంచి వాకౌట్ చేశాం. ప్రజా పాలన అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడమా..?. బీఏసీ సమావేశం అర్థం పర్థం లేకుండా పోయింది. రేపటి ఎజెండా ఏందో ఇప్పటి వరకు చెప్పలేదు. రాత్రికి చెబితే ప్రతిపక్ష ఎమ్మెల్యే లు ఎప్పుడూ ప్రిపేర్ అవ్వాలి. అందుకే బీఏసీ నుంచి వాకౌట్ చేశాం అని హరీష్‌రావు అన్నారు.
ఇదిలా ఉంటే.. సభ ఎన్నిరోజులపాటు నిర్వహించాలన్నది రేపు(ఆదివారం) నిర్ణయిస్తామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అంటున్నారు. ‘‘కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై రేపు సభలో చర్చ ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ను రేపు సభలో పెడతాం. బీఆర్ఎస్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అన్ని అంశాలపై చర్చ చేయాలంటే.. నాలుగైదు రోజులు బ్రేక్ ఇచ్చి సభ నడుపుతాం. గణేష్ నిమజ్జనం ,వరదల నేపథ్యంలో.. మధ్య లో బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం అని శ్రీధర్‌బాబు మీడియాకు తెలిపారు.